హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందా? ఈ 3 పనులు చేస్తే బిల్స్ ఎవ్వరూ ఆపలేరు!

హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందా? ఈ 3 పనులు చేస్తే బిల్స్ ఎవ్వరూ ఆపలేరు!

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఆర్థిక భద్రతలో మొదటి అడుగు మాత్రమే. IRDAI లెక్కల ప్రకారం.. 2024-25లో క్లెయిమ్ చేసిన ప్రతి 4 రూపాయల్లో ఒక రూపాయిని ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించలేదని వెల్లడైంది. అంటే ప్రతి నాలుగు క్లెయిమ్‌లలో ఒకటి తిరస్కరణ, పాక్షికంగా ఆమోదించబడింది. మీరు కష్టపడి తీసుకున్న పాలసీ ఆసుపత్రి బిల్లులను పూర్తిగా చెల్లించాలంటే.. ఈ మూడు విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

1. పాత అనారోగ్య సమస్యలను దాచవద్దు:
పాలసీ తీసుకునేటప్పుడు మీకు ఉన్న బీపీ, షుగర్ వంటి సమస్యలను దరఖాస్తు ఫారంలో కచ్చితంగా వెల్లడించాలి. చాలామంది వీటిని చిన్న విషయాలుగా భావించి దాచిపెడతారు. కొన్నిసార్లు ఏజెంట్ల తొందరపాటు వల్ల చెప్పటం మర్చిపోతుంటారు. కానీ చికిత్స సమయంలో ఆసుపత్రిలో ఇచ్చే వివరాలకు, పాలసీ తీసుకున్నప్పుడు ఇచ్చిన వివరాలకు తేడాలు వస్తే.. ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌ను రిజెక్ట్ చేస్తుంటాయి. కాబట్టి దరఖాస్తు నింపేటప్పుడు మీ హెల్త్ హిస్టరీ గురించి పూర్తి నిజాయితీగా వివరాలు అందించాలి. 

2. అనవసరమైన హాస్పిటల్ అడ్మిషన్స్:
చిన్నపాటి జ్వరాలు, సాధారణ అనారోగ్య సమస్యలకు కూడా ఆసుపత్రులు అనవసరంగా అడ్మిట్ చేసుకోవటం జరుగుతుంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు అటువంటి క్లెయిమ్‌లను నిశితంగా పరిశీలిస్తాయి. ఆ చిన్న సమస్యకు హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదని తేలితే క్లెయిమ్ తిరస్కరించబడవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ ఉందనే ఉద్దేశంతో ఆసుపత్రులు సాధారణ ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో బిల్లులను సరిచూసుకోవడం, చికిత్సకు ముందే ఖర్చుల అంచనా తీసుకోవడం బెస్ట్. 

3. పాలసీ రూల్స్ పూర్తిగా చదివి అర్థం చేసుకోవటం:
చాలా పాలసీల్లో రూమ్ రెంట్ క్యాప్ వంటి నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు మీ పాలసీ రోజుకు రూ.5వేల గది అద్దెను మాత్రమే కవర్ చేస్తే.. మీరు రూ.10వేల గదిని ఎంచుకున్నప్పుడు.. అద్దెతో పాటు సర్జరీ ఫీజులు, నర్సింగ్ ఖర్చులు వంటి ఇతర ఖర్చుల్లో కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కోత విధిస్తుందని తెలుసుకోండి. దీనివల్ల రూ. 4 లక్షల బిల్లు వస్తే మీకు దానిలో సగం మాత్రమే చెల్లించే అవకాశం ఉంది. అంటే మిగిలిన మెుత్తం పేషెంట్ ఫ్యామిలీనే కట్టాల్సి ఉంటుంది. కాబట్టి పాలసీ తీసుకునే ముందే మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్స్, నెట్‌వర్క్ ఆసుపత్రుల వివరాలను క్షుణ్ణంగా చదువుకోవాలి.

గతేడాది హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల విలువ రూ. లక్షా 32 వేల కోట్లు దాటింది. ఇందులో సుమారు రూ. 30 వేల కోట్లు క్లెయిమ్స్ తిరస్కరణకు గురయ్యాయి. ఈ సంక్లిష్టమైన నిబంధనలను అర్థం చేసుకోవడం కష్టమనిపిస్తే.. అనుభవం ఉన్న ఇన్సూరెన్స్ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిది. పాలసీ కొనేటప్పుడు, క్లెయిమ్ చేసేటప్పుడు చూపే అప్రమత్తతే మీ డబ్బును, సమయాన్ని కాపాడుతుంది. గుడ్డిగా ఏజెంట్లు, బ్రోకర్లు చెప్పే వెన్నపూస లాంటి మాటలు విని మీకున్న రోగాల గురించి చెప్పటం మర్చిపోయి పాలసీ కొన్నారో తర్వాత ఎదురయ్యే సమస్యలకు మీరే బాధ్యులు అవుతారని గుర్తుంచుకోండి. పాలసీ కొనేటప్పుడు వాళ్లు అడగకపోయినా పూర్తి హెల్త్ స్టేటస్ వివరాలు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉంటుందని గుర్తుంచుకోండి.