ఫస్ట్ డే వన్ వే కష్టాల్.!    15 నిమిషాలకు బదులు గంట జర్నీ  

ఫస్ట్ డే  వన్ వే కష్టాల్.!    15 నిమిషాలకు బదులు గంట జర్నీ  
  • చెక్​పోస్ట్, యూసుఫ్​గూడ, వెంకటగిరి వాసుల ఇబ్బందులు
  •     ఫిల్మ్​నగర్, జూబ్లీహిల్స్​ 45 వెళ్లడానికి చుట్టూ చక్కర్లు  
  •     15 నిమిషాలకు బదులు గంట జర్నీ  
  •     తికమక పడ్డ బస్సు ప్రయాణికులు  
  •     ఫుట్​పాత్​లు లేక పాదచారుల కష్టాలు  
  •     రెండు రోజుల్లో అన్ని సమస్యలు సెట్​ చేస్తామన్న సీపీ సజ్జనార్​ 
  •     వన్​వే రూట్లలో బైక్​పై జర్నీ 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  కేబీఆర్ పార్క్ చుట్టూ మంగళవారం మొదలుపెట్టిన వన్ వే ట్రాఫిక్ విధానం కొంతమంది వాహనదారులకు ఇబ్బందులను కలిగించింది. హెచ్-సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో రెండేండ్ల పాటు వన్​వే కొనసాగించనుండగా, మొదటి రోజు సమాచార లోపంతో అక్కడక్కడా సమస్యలు తలెత్తాయి. కేబీఆర్ ​పార్క్ ఎదుట, అగ్రసేన్ జంక్షన్​, బాలకృష్ణ ఇల్లు, సీవీఆర్ ​జంక్షన్ ​ఏరియా, జర్నలిస్టు కాలనీ తదితర ప్రాంతాల్లో  ట్రాఫిక్ జామ్స్​ ఏర్పడ్డాయి. ఎక్కువగా యూసుఫ్​గూడ, వెంకటగిరి, జూబ్లీహిల్స్ ​చెక్​పోస్ట్​ నుంచి - ఫిల్మ్​నగర్, జూబ్లీహిల్స్ ​రోడ్​నం ​45, ​36 వైపు వెళ్లే వాహనదారులు చుక్కలు చూశారు. రోడ్ నంబర్ 36కి వెళ్లేవారు చెక్‌‌పోస్ట్ దాకా రాకుండా వెంకటగిరి జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 10, డైమండ్ హౌజ్ ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించినా  చాలా మంది చెక్​పోస్ట్​వరకు వచ్చి ఇబ్బందులు పడ్డారు. 

అడిగితే ఆ సైన్ బోర్డులు చాలా చిన్నగా కనిపించలేదని సమాధానమిచ్చారు. చెక్ పోస్ట్ ​మీదుగా ఇంతకుముందు రోడ్ ​నంబర్​45,  ఫిల్మ్​నగర్​వైపు10 నిమిషాల్లోపే వెళ్లిపోయేవారు. వన్​వేతో చెక్​పోస్ట్ ​నుంచి ఎన్టీఆర్​భవన్, బసవతారకం క్యాన్సర్​ హాస్పిటల్​, అగ్రసేన్​ఏరియాల మీదుగా 4.8 కిలోమీటర్ల నుంచి 5.3 కిలోమీటర్లు ఎక్కువ తిరగి వెళ్లాల్సి వచ్చింది. దీంతో వీరంతా అసహనం వ్యక్తం చేశారు.  కొందరు చుట్టూ తిరిగే ఓపిక తమకు లేదంటూ రాంగ్​రూట్​లో వెనక్కి వెళ్లిపోయారు.  బంజారాహిల్స్​ రోడ్ ​నంబర్ 12 నుంచి వచ్చే వాహనాలు, కేబీఆర్ ​ఎంట్రన్స్, బసవతారకం , బీఆర్​ఎస్​ భవన్​ నుంచి వచ్చే వెహికల్స్​అగ్రసేన్​  జంక్షన్ ​వద్ద కలవడంతో వాహనాల మూవ్​మెంట్ ​స్లో అయ్యింది. 

 వన్​వే తెలియదు.. ఒక్కసారికి పంపించండి  

 చెక్​పోస్ట్ ​నుంచి ఫిల్మ్​నగర్ ​వైపు వెళ్లాల్సిన వాహనదారులు తమకు వన్-వే రూల్స్​గురించి తెలియదని, ఈ ఒక్కసారికి పంపించాలని  పోలీసులతో వాగ్వాదానికి దిగడం కనిపించింది.  ‘కిలోమీటర్​ దూరంలోనే  మా ఆఫీసు.. ఈ రోజు నుంచి వన్​వే అని తెలియదు..ఇప్పుడూ చుట్టూ తిరిగి వెళ్లాలి. పెట్రోల్​, టైం రెండూ వేస్ట్​..ఈ ఒక్కసారికి పంపించండి’ అని వాహనదారులు ట్రాఫిక్​ పోలీసులతో లొల్లి పెట్టుకున్నారు.  

 అయ్యో.. ఈ బస్సు ఎటు పోతోంది? 

యూసుఫ్​గూడ వైపు నుంచి వచ్చే బస్సులు కూడా పార్కు చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో ఆలస్యమవుతుందని ప్రయాణికులు డ్రైవర్లు, కండక్టర్లతో వాదనకు దిగారు.  సికింద్రాబాద్ ​నుంచి వచ్చే10 హెచ్ ​బస్సు  యూసుఫ్​గూడ, చెక్​పోస్ట్​ మీదుగా రోడ్​ నంబర్​ 36 నుంచి కొండాపూర్​ వెళ్లేది. వన్​వేతో పార్కు చుట్టూ తిరగడంతో సమయం వృథా అయ్యింది. 

పంజాగుట్ట వైపు నుంచి వచ్చే 47ఎల్  ఇంతకుముందు ఎల్వీప్రసాద్​, చెక్​పోస్ట్ ​నుంచి ఫిల్మ్​నగర్​ మీదుగా మణికొండ వెళ్లేవి. చెక్‌‌పోస్ట్ నుంచి ఫిల్మ్​నగర్​ / జర్నలిస్ట్ కాలనీ  1.5 నుంచి 2 కిలోమీటర్లే ఉంటుంది..కానీ, వన్​ వేతో కేబీఆర్ ​పార్కు ఎదురుగా లెఫ్ట్​ తీసుకుని  బసవతారకం, అగ్రసేన్​ జంక్షన్​ మీదుగా వెళ్లడంతో ఆలస్యం ఏమీ కాకపోయినా, కొత్త రూట్​ అంటూ  ప్యాసింజర్లు తికమక పడ్డారు. ఈ బస్సులో కొంతమంది జూబ్లీహిల్స్ ​చెక్​పోస్ట్​కు వెళ్దామని ఎక్కగా,  ఫిల్మ్​నగర్​ వద్ద దిగి చెక్​పోస్ట్ ​వైపు నడుచుకుంటూ, ఇతర బస్సులు, ప్రైవేట్​వాహనాల్లో వెళ్లాల్సి వచ్చింది.  వన్​ వే ఉందని తెలిసిన వారు కేబీఆర్ దగ్గర దిగి నడిచిపోయారు.   

బాలకృష్ణ ఇంటి దగ్గర యూ టర్న్​ ఎందుకు? 

వన్​ వే అమలు చేస్తున్నా  బాలకృష్ణ ఇంటి వద్ద  ఇంతకుముందు ఉన్నట్టే  యూటర్న్​ ను కంటిన్యూ చ చేయడంతో   వాహనదారులు నరకం చూశారు. దుర్గం చెరువు, మైండ్ స్పేస్  వెళ్లే ఈ ప్లై ఓవర్ కింద నుంచి యూ టర్న్​ తీసుకొని మళ్లీ చెక్​ పోస్ట్​ వైపు వెళ్లడానికి అష్టకష్టాలు పడ్డారు. వన్ వే లేకముందే   యూటర్న్ పెట్టారని, ఇప్పుడు  కూడా  కొనసాగించడం ఎంత వరకు కరెక్ట్ అని వాహనదారులు ప్రశ్నించారు.  

ఫుట్ పాత్‌‌లపై దృష్టి పెట్టలే..

పార్క్ చుట్టూ వన్ వే  అమలుపై దృష్టి పెట్టిన పోలీసులు  ఫుట్​పాత్​ల గురించి, పాదచారుల గురించి పట్టించుకోలేదు.  ఎక్కడా సిగ్నల్స్ లేకపోవడం, భారీ సంఖ్యలో వాహనాల రాకతో పాదచారులు  బిక్కు బిక్కుమంటూ పక్కల  నుంచి వెళ్లడం కనిపించింది. వన్ వే పైనే కాకుండా ఫుట్​పాత్​పైనా దృష్టి పెట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

గూగుల్ అప్​డేట్​తో వాళ్లకు రిలీఫ్​ 

 పార్క్ చుట్టూ గతంలో ఉన్న గూగుల్ మ్యాప్ ను అప్ డేట్ చేయించడతో కార్లలో వెళ్లేవారు, ర్యాపిడో, ఊబర్​, ఓలాలో వెళ్లేవారు ఇబ్బందులు లేకుండా వెళ్లిపోయారు. సోమవారం రాత్రి వరకు జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు నుంచి రోడ్ నెంబర్ 45 కు డైరెక్టుగా చూపించే మ్యాప్ మంగళవారం ఉదయం నుంచి  కొత్త  రూట్​చూపించింది.  

కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం

కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రధాన జంక్షన్లలో ఇప్పటికే ఉన్న సీసీటీవీ కెమెరాలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌‌కు లింక్​ చేసి  ఏ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయిందో పరిశీలించారు.  అలాగే, స్పెషల్ డ్రోన్లను ఎగరవేసి పరిస్థితిని సమీక్షించారు.  రోడ్లపై డ్యూటీలో ఉన్న   ట్రాఫిక్ సిబ్బందికి వాకీ-టాకీలు వైర్‌‌లెస్ ద్వారా ఎక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయాలో తక్షణ ఆదేశాలు జారీ చేశారు.

బైక్​పై సిటీ పోలీస్​ బాస్  

వన్​వేతో కలుగుతున్న ఇబ్బందులను  పరిశీలించేందుకు సిటీ సీపీ సజ్జనార్ వన్​ వే ఏరియాను బైక్​పై కవర్​ చేశారు. డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ ​మూవ్​మెంట్​ను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ రోడ్ నెంబర్ 45, అగ్రసేన్, వెంకటగిరి ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తాయని,  పీక్ అవర్​లో ఎక్కువ సమస్య ఉందన్నారు.  కొన్ని చోట్ల సైన్ బోర్డులు  ఏర్పాటు చేయాల్సి ఉందని,  మరికొన్ని చోట్ల పెద్ద సైజులో మార్చాల్సి ఉందన్నారు.  మొదటి రోజు ఇబ్బందులు సహజమని,  రెండు, మూడు రోజుల్లో సమస్యలు క్లియర్ చేస్తామన్నారు. పార్కు చుట్టూ జాయింట్ సీపీ, డీసీపీల పర్యవేక్షణలో  వెయ్యి మంది ట్రాఫిక్ ​పోలీసులు నాలుగు షిఫ్టుల్లో డ్యూటీలు చేస్తున్నారన్నారు.  అంతకుముందు జీహెచ్​ఎంసీ కమిషనర్​ కర్ణన్​, ట్రాఫిక్​ బాస్​ జోయల్​ డేవిస్​ తో కలిసి వన్​ వేను పరిశీలించారు. 

ఇన్​ఫ్లూయెన్లర్లు ఏం చేస్తున్నట్టు!?

  •     ఇన్ఫో లేదంటూ బాధితుల ఫైర్​

‘వన్​వే గురించి..ఏ రీల్​లోనూ, షార్ట్​లోనూ చెప్పలే.. ఇన్​ఫ్లూయెన్లర్లంతా ఏం చేస్తున్నట్టు? ఏవో ఏవో వీడియోలు పెడతారు.. వన్​వే లాంటి విలువైన సమాచారం చెప్తూ వీడియోలు చేయొచ్చు కదా.. అలా చేస్తే మేం ఇప్పుడు ఇబ్బందులు పడేవాళ్లం కాదు’ అని పలువురు వాహనదారులు తమ ఆవేదన వెళ్లగక్కారు. వన్​వే పెట్టారని తెలియలేదని, ఎప్పుడూ రీల్స్​ చూస్తామని ఏ రీల్​లోనూ  తమకు కనిపించలేదన్నారు.  ఈ మధ్య తాము ఖాళీ టైం దొరికితే సోషల్​మీడియాలో రీల్స్, షార్ట్స్​చూస్తున్నామని, సామాజిక బాధ్యతతో కూడిన అంశాలపైనా ఇన్​ఫ్లూయెన్సర్లు సమాచారం ఇవ్వాలని కోరారు. 

బస్సుల రూట్లు మారినయ్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: వన్​వే దృష్ట్యా కేబీఆర్​నుంచి వెళ్లే బస్సు రూట్లలోని స్టాప్‌‌లు, స్టేజీలలో స్వల్ప మార్పులుచేసినట్టు ఆర్టీసీ ప్రకటించింది. రూట్ నంబర్​127కె కొండాపూర్ –- కోఠి, రూట్ నంబర్​222ఏ పటాన్‌‌చెరు–  కోఠి, రూట్ నంబర్​47ఎల్​: మణికొండ– - సికింద్రాబాద్ /జేబీఎస్, రూట్ నంబర్​10హెచ్​కొండాపూర్ –- సికింద్రాబాద్ రూట్లలో మార్పులు చేసినట్టు తెలిపారు. 

సికింద్రాబాద్​ మణికొండ  47ఎల్​

ఎల్వీ ప్రసాద్​వరకు రెగ్యులర్​రూట్​లోనే వెళ్తుందని అక్కడి నుంచి లెఫ్ట్​తీసుకుని బసవతారకం హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా, అపోలో దవాఖాన, ఫిల్మ్ నగర్, దర్గా మీదుగా మణికొండ చేరుకుంటుందన్నారు. రిటర్న్​లో పాత రూట్​లోనే వస్తుందన్నారు. 

సికింద్రాబాద్–కొండాపూర్ వెళ్లే 10 హెచ్

బస్సులు కూడా రెగ్యులర్​రూట్​లోనే నడుస్తాయని, యూసఫ్ గూడ ఎక్స్ రోడ్స్ దాటిన తర్వాత మాత్రం వెంకటగిరి, నవయుగా, పెద్దమ్మ గుడి మీదుగా కొండాపూర్ చేరుకుంటాయన్నారు. డౌన్ జర్నీలో రెగ్యులర్​రూట్​ఉంటుందన్నారు.  

కోఠి నుంచి పటాన్‌‌ చెరుకు నడిచే 222ఏ

 బస్సులు రెగ్యులర్​రూట్​లోనే వెళ్లి కేబీఆర్​పార్కు దగ్గర లెఫ్ట్​తీసుకుని బసవతారకం హాస్పిటల్, ఎమ్మెల్యే కాలనీ మీదుగా మళ్లీ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కు వచ్చి రోజూ వెళ్లే రూట్​లోనే వెళ్తుందన్నారు. అలాగే రిటర్న్​లో ఇంతకుముందు వచ్చిన రూట్​లోనే వస్తుందన్నారు. 

కోఠి నుంచి  కొండాపూర్ వెళ్లే 127కే 

బస్సులు రెగ్యులర్​రూట్​లోనే వెళ్తాయని, వచ్చేప్పుడు మాత్రం రోడ్డు నంబర్ 45, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ , పెన్షన్​హౌస్​, మాసబ్​ ట్యాంక్  నుంచి కోఠికి చేరుకుంటాయి.