చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రి వివేక్ స్పష్టం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజల సహకారంతోనే రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు.
పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ పనుల విషయంలో ప్రజలతో చర్చలు జరిపామని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తున్నారని మంత్రి అన్నారు. కోటి 80 లక్షల రూపాయలతో బైపాస్ రోడ్డు పనులు ప్రారంభించాం. అభివృద్ధి పనుల్లో ఉపాధి కోల్పోయే వారికి ప్రత్యామ్నాయంగా షాపులు కేటాయిస్తాం. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించినా, మేము బాధితులకు న్యాయం చేస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ బుల్డోజర్ పాలన వలె కాకుండా, ప్రజల అంగీకారంతోనే ప్రజా పాలన సాగుతోందని మంత్రి వివేక్ అన్నారు.
నియోజకవర్గ యువతకు మెరుగైన ఉపాధి కల్పించడమే ధ్యేయంగా మంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.ఏప్రిల్‌లో నా జర్మనీ పర్యటనలో భాగంగా అక్కడి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాను. మన యువతకు జర్మనీ భాషలో శిక్షణ ఇప్పించి, సంవత్సరానికి 25 నుండి 30 లక్షల రూపాయల వేతనం లభించేలా అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అని ఆయన వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృథా చేసిందని మంత్రి విమర్శించారు. 3 వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లులను భారం చేశారు. కానీ మేము ఎల్లంపల్లి ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నాం. గొల్లవాగు ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరందించేందుకు అనుమతులు తీసుకున్నాం. జైపూర్ మండలంలోని మొసళ్ళ మడుగును పర్యాటక కేంద్రంగా (టూరిస్ట్ సెంటర్) అభివృద్ధి చేస్తాం అని ప్రకటించారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి వివేక్ ఖండించారు. ఈ పథకాలపై కేసు కోర్టులో ఉంది. వాదనలు వినిపించి కేసు గెలుస్తాం. ప్రస్తుతం ఎవరైనా వివాహం చేసుకుంటే వారికి చెక్కులు అందజేస్తాం అని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఘాట్ల అభివృద్ధి పనులు వేగవంతం చేశామని, ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.
