ఆర్టీసీ విలీన ప్రక్రియకు ప్రభుత్వం ఓకే : కేంద్ర మాజీ మంత్రి వేణు గోపాలా చారి

ఆర్టీసీ విలీన ప్రక్రియకు ప్రభుత్వం ఓకే : కేంద్ర మాజీ మంత్రి వేణు గోపాలా చారి

నిర్మల్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి సము ద్రాల వేణుగోపాలాచారి తెలిపారు. ఆదివారం నిర్మల్​లోని గెస్ట్​హౌస్​లో మీడియాతో మాట్లాడారు. విలీన ప్రక్రియలో ఏ ఒక్క కార్మికుడికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎన్నికల్లో అశ్వత్థామరెడ్డి నాయకత్వాన్ని ప్రభుత్వం బలపరుస్తున్నట్లు తెలిపారు. ఆయనకు నేషనల్  మజ్దూర్  యూనియన్ లో పని చేసిన అనుభవం ఉందని, పలు కార్మిక సంఘాల మద్దతు ఉన్నట్లు తెలిపారు. 

కార్మికులు ప్రభుత్వంపై, అశ్వత్థామరెడ్డి నాయకత్వంపై నమ్మకం ఉంచి బాణం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని, డీఏలు సైతం పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, కొంతం గణేశ్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.