గర్భిణులు, శిశువుల రక్షణకు చర్యలు తీసుకోవాలి : నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా

గర్భిణులు, శిశువుల రక్షణకు చర్యలు తీసుకోవాలి : నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా
  •  కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్, వెలుగు: జిల్లాలో గర్భిణులు, బాలింతలు, శిశువుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘అంకురం’ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం కలెక్టరేట్​లో నిర్వహించగా కలెక్టర్​పాల్గొని మాట్లాడారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేవరకు తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. గర్భిణుల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే వారిపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి, వారిని సంరక్షించాలని సూచించారు. 

ఎన్ఎంఆర్​ను సింగిల్ డిజిట్​కు పరిమితం చేయడమే అంకురం కార్యక్రమం లక్ష్యమన్నారు. గర్భిణులకు అవసరమైన అన్ని పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలన్నారు. కార్యక్రమ వాల్​పోస్టర్లను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. డీఎంహెచ్​వో రాజేందర్, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పర్యవేక్షకుడు గోపాల్ సింగ్, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.