- డీసీసీ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకోవడం మానుకోవాలని, అలా చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని ఆసిఫాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, డీసీసీ మాజీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావుతో కలిసి డీసీసీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఎమ్మెల్యే కోవ లక్ష్మి కావాలనే గొడవ పడ్డారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూనే ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు అయినా కట్టించిందా అని మంత్రి ప్రశ్నిస్తే.. వ్యక్తిగతంగా విమర్శించడం ఎమ్మెల్యే స్థాయికి తగదన్నారు. ప్రజల డబ్బుతో కట్టిన అసెంబ్లీ, సెక్రటేరియట్భవనాలను తమ పార్టీ నాయకుడి ఘనతగా చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు, రాజకీయ కక్షలు పక్కనపెట్టి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు తరిఖ్, భీమ్ రావ్, ఆర్జీఎస్ జిల్లా కోర్డినేటర్ కోవా ఇందిరా, మార్కెట్ కమిటీ డైరెక్ట్ మారుతి పటేల్ తదితరులు పాల్గొన్నారు.
