వనపర్తి టౌన్/నాగర్‌కర్నూల్ టౌన్, వెలుగు : ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేనంత మాత్రాన ఓటరు పేరు తొలగించినట్లు కాదని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ కె. సురేంద్ర మోహన్ తెలిపారు. బుధవారం వనపర్తి, నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో వేర్వేరుగా ఆయా కలెక్టర్లు ఆదర్శ్ సురభి, హేమంత పాటిల్‌తో కలిసి తహసీల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు అర్హత ఉన్నవారు ఫారం-6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాల్లో ఉన్న ఓటర్లకు నోటీసులు ఇచ్చి, ఏఈఆర్‌ఓల ఆధ్వర్యంలో నిర్వహించే హియరింగ్‌కు హాజరై తగిన గుర్తింపు పత్రాలు సమర్పించాలని సూచించారు.
వనపర్తి జిల్లాలో 2,37,006 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదల కాగా, గత జాబితాతో పోలిస్తే 38,564 మంది తగ్గారు. అనామలీస్ జాబితాలో 74,462 మంది, నో మ్యాపింగ్ జాబితాలో 12,027 మంది ఉన్నారని తెలిపారు. మొత్తం 86,489 మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్‌ఓలు సమన్వయంతో పనిచేయాలని అబ్జర్వర్ కోరారు. వనపర్తి జిల్లాలో గతంలో 316 ఉన్న పోలింగ్ కేంద్రాలకు కొత్తగా మరో 6 పోలింగ్ కేంద్రాలను గుర్తించి 322 పోలింగ్ కేంద్రాలకు పెంచినట్లు చెప్పారు.
