ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్: రోహిత్, కోహ్లీ వన్డే భవిష్యత్తుపై శుభ్‌మన్ గిల్ క్లారిటీ!   

ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్: రోహిత్, కోహ్లీ వన్డే భవిష్యత్తుపై శుభ్‌మన్ గిల్ క్లారిటీ!   

Shubman Gill: టీమిండియా వెటరన్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే కెరీర్‌పై గత కొంతకాలంగా జరుగుతున్న చర్చలకు భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) పూర్తిగా తెరదించాడు. వెస్టిండీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసినంతరం న్యూ చండీగఢ్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో గిల్ మాట్లాడుతూ.. ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్లు జట్టుకు ఎంత కీలకమో మరోసారి రుజువు చేశారు. వారి వయసు గురించి వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూ, ప్రస్తుత ఫామ్ ఆధారంగా వారికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తేల్చిచెప్పారు.

అద్భుతమైన ఫామ్‌లో రోహిత్, కోహ్లీ: 

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగగా.. రెండో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. ఇక మూడో వన్డేలోనూ రోహిత్ తృటిలో సెంచరీ కోల్పోయి 92 పరుగుల దగ్గర వెనుదిరిగినప్పటికీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ (37 ఏళ్లు), రోహిత్ (39 ఏళ్లు) వయసు రీత్యా వారి భవిష్యత్తుపై జరుగుతున్న చర్చలపై గిల్ తీవ్రంగా మండిపడ్డాడు. వాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు.. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ భాయ్ మూడు సెంచరీలు సాధించారు. విరాట్ భాయ్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇక కేఎల్ రాహుల్ ఎప్పుడు అవకాశం వచ్చినా జట్టు కోసం అద్భుతంగా రాణిస్తున్నాడని కెప్టెన్ పేర్కొన్నారు. సీనియర్ ఆటగాళ్లకు టీమిండియా సారథి నుంచి లభించే ఈ నమ్మకం జట్టులో ఎంతో సానుకూల వాతావరణాన్ని నింపుతోంది.

రాబోయే వరల్డ్ కప్ ప్రణాళికలు: 

కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి రోహిత్, కోహ్లీలను కొన్ని మ్యాచ్‌లు పక్కన పెట్టాలనే చర్చలపై శుభ్‌మన్ గిల్ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత కాలంలో వన్డే మ్యాచ్‌లు తక్కువగా జరుగుతుండటంతో పెద్దగా ప్రయోగాలు చేయడానికి సమయం లేదని స్పష్టం చేశారు. నిజం చెప్పాలంటే ప్రయోగాలు చేయడానికి అంతగా సమయం లేదు. రాబోయే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని మనం ఏ కాంబినేషన్‌తో అయితే ఆడాలనుకుంటున్నామో, ఆ కాంబినేషన్‌తోనే వచ్చే సిరీస్ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నామని తేల్చిచెప్పారు. 

భారత జట్టు తన తదుపరి వన్డే అసైన్‌‌మెంట్ కోసం దాదాపు ఒక నెల రోజుల పాటు వేచి ఉండాల్సి ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌తో టీమిండియా మళ్లీ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానంపై కెప్టెన్ గిల్ ఇచ్చిన ఈ క్లారిటీ వారిద్దరి అభిమానులకు ఊరటనిచ్చే విషయమే.