వారం రోజులు - ఏ రోజు ఏం చేయాలి?మానవుడు ఏ రోజు ఏం చేయాలి?ఏం చేస్తే పుణ్యఫలితం దక్కుతుంది. ఏ రోజు ఏం కార్యాలు చేయాలి..?ఏ దేవున్ని పూజించాలి..? మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
వారానికి ఏడు రోజులు ఈ విషయం అందరికి తెలిసిందే.. ఆదివారంతో ప్రారంభమై శనివారంతో ముగుస్తుంది. అయితే శాస్త్రాలు.. పురాణాల్లో ఏ రోజు ఏం చేయాలి. ఏ దేవుడిని ఎలా పూజించాలో వివరించారు.
ఏ రోజు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో శివ మహా పురాణంలోని విద్యేశ్వర సంహిత 14వ అధ్యాయం పూర్తిగా వివరించింది. దేవతల ఆశీస్సులు పొందేందుకు ఐదు రకాలుగా పూజ చేయవచ్చని పండితులు చెబుతున్నారు.
మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే 5 విధాలు.
సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ 4 రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది.
పురాణాల ప్రకారం పూజలు మనకున్న 7 వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చేయాల్సి ఉంటుంది.
ఆదివారం : ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్ర వ్యాధులు, శిరోరోగం, కుష్ఠువ్యాధి తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక 3 సంవత్సరాల పాటు రోగ తీవ్రతనను బట్టి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.
సోమవారం : సంపద కోరుకోనేవారు సోమవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి. పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయాలి. ఇలా చేయడం వలన క్రమేణ దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి.
మంగళవారం : ఆరోగ్య సమస్యలు తగ్గేందుకు కాళీ దేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి. హనుమంతుడికి ఆకుపూజ చేసి వడమాల సమర్పించాలి. ఇబ్బందులు.. కష్టాలు తొలగుతాయి.
బుధవారం : పెరుగు అన్నాన్ని విష్ణు దేవునికి నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. జీవితం సాఫీగా సాగుతుంది. ఆలోచనశక్తి పెరుగుతుంది. తెలివితేటలు వృద్ది చెందుతాయి.
గురువారం : ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవానికి గురువారం రోజున పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం చాలా మంచిదని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది.
శుక్రవారం : ఆరోజు కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించాలి. పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించడం మంచిది. లలితా సహస్రనామం పఠించాలి. లేదా భక్తితో శ్రద్దగా వినాలి. అమ్మవారి అనుగ్రహం కోసం కుంకుమ పూజ చేయాలి.
శనివారం : రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. శని దోష పూజాది కార్యక్రమాలు కూడా చేయాలి. పేదలకు అన్నదానం చేయాలి. కాకులకు ఆహారం పెట్టడం వలన పితృదేవతలు అనుగ్రహం కలుగుతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
