ఘనంగా ఆసియా గేమ్స్ క్లోజింగ్ సెర్మనీ.. భారత్‌లో ఎన్ని గంటలకు చూడాలంటే?

ఘనంగా ఆసియా గేమ్స్ క్లోజింగ్ సెర్మనీ.. భారత్‌లో ఎన్ని గంటలకు చూడాలంటే?

Asian Games 2026 Closing Ceremony: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా గత 16 రోజులుగా హోరాహోరీగా కొనసాగిన 20వ ఆసియా క్రీడలు (Asian Games 2026) నేటి (అక్టోబర్ 4, ఆదివారం)తో అధికారికంగా ముగియనున్నాయి. సెప్టెంబర్ 19వ తేదీన ప్రారంభమైన ఈ మెగా స్పోర్టింగ్ ఈవెంట్.. కాసేపట్లో (అక్టోబర్ 4న) నగోయాలోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అట్టహాసంగా జరిగే ముగింపు వేడుకలతో (Closing Ceremony) తెరపడనుంది. ఆసియా ఖండం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది అథ్లెట్ల కఠిన శ్రమ, మధుర జ్ఞాపకాలతో ఈ క్రీడా సంబరం ముగియనుంది.

ముగింపు వేడుకలు:

జపాన్ సంస్కృతి ఉట్టిపడేలా, అథ్లెట్ల ఘనతను చాటేలా ఈ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేదికపైనే తదుపరి ఆసియా క్రీడల ఆతిథ్య నగరానికి బాధ్యతల బదలాయింపు (Handover) అలాగే క్రీడాజ్యోతి ఆర్పివేత కార్యక్రమం జరగనుంది.

* వేదిక: నగోయా, మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియం (జపాన్)

* స్థానిక సమయం: అక్టోబర్ 4, సాయంత్రం 6:00 గంటలకు

* భారత కాలమానం (IST): మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమై సుమారు 4:00 గంటలకు ముగియనుంది.

భారత పతాకధారిగా నీరూ ధాండా: 

ఈ అద్భుతమైన ముగింపు వేడుకల పరేడ్‌లో దేశం తరఫున త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని నడిచే అరుదైన గౌరవం ప్రముఖ భారతీయ తృప్ షూటర్ నీరూ ధాండా (Neeru Dhanda)కు దక్కింది. టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన నీరూ ధాండాను భారత పతాకధారిగా (Flag Bearer) ఎంపిక చేశారు.

ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన: 

ఈసారి ఆసియా క్రీడలలో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణించి చరిత్ర సృష్టించారు. టోర్నమెంట్ ముగింపు రోజు నాటికి భారత క్రీడాకారులు పతకాల పట్టికలో అగ్రశ్రేణిలో నిలిచారు. ముగింపు రోజుకు ముందు నాటికే భారత కంట్రిబ్యూషన్ 80 పతకాలను దాటగా, అందులో 18 స్వర్ణాలు, 26 రజతాలు, 36 కాంస్యాలు ఉన్నాయి.

చివరి రోజు మెరిసిన టీమిండియా: ముగింపు రోజున భారత్‌కు రెండు కీలకమైన స్వర్ణ పతకాలు లభించాయి. పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ స్వర్ణాన్ని నిలబెట్టుకోగా.. పురుషుల హాకీ ఫైనల్‌లో మలేషియాను 5–1 గోల్స్ తేడాతో చిత్తు చేసి మరో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. హాకీ విజయం ద్వారా భారత్ నేరుగా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం విశేషం.