ధోనీ ఇచ్చిన ఒక్క సలహా.. భారత్‌పై వెస్టిండీస్ సంచలన విజయం! కెప్టెన్ హోప్ ఏం చెప్పాడంటే?

ధోనీ ఇచ్చిన ఒక్క సలహా.. భారత్‌పై వెస్టిండీస్ సంచలన విజయం! కెప్టెన్ హోప్ ఏం చెప్పాడంటే?

MS Dhoni Advice to Shai Hope: ముల్లన్‌పూర్ (న్యూ చండీగఢ్) వేదికగా జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా 352 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. కెప్టెన్ షాయ్ హోప్ (Shai Hope) వీరవిహారంతో భారత్‌ను చిత్తు చేసి 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కరేబియన్ కెప్టెన్ హోప్ మాట్లాడుతూ.. లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఇచ్చిన సలహా వల్లే తాను ఒత్తిడిని జయించి ఈ రికార్డు ఛేదనను పూర్తి చేయగలిగానని వెల్లడించాడు.

ధోనీ చెప్పిన మాటలే నాకు ఆయుధమయ్యాయి: షాయ్ హోప్

ఈ మ్యాచ్‌లో విండీస్ విజయం వెనుక షాయ్ హోప్ అసాధారణ పోరాటపటిమ ఉంది. ఏకంగా 50 ఓవర్లు వికెట్ కీపింగ్ చేసి, ఆ వెంటనే ఓపెనర్‌గా బరిలోకి దిగి, తీవ్రమైన కండరాల నొప్పులు (Cramps) వేధిస్తున్నప్పటికీ హోప్ మైదానాన్ని వీడలేదు. చివరి వరకు నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. భారత్‌లో ఛేజింగ్ చేయడం ఎప్పుడూ మజానే ఇస్తుంది, ముఖ్యంగా ఇక్కడ మంచు (Dew) ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సిరీస్‌‌ను ఘనంగా ముగించాలనుకున్నాం, అనుకున్నట్లుగానే గెలిచాం.. నాకు కొద్దీగా హెల్త్ ఇష్యూ వచ్చినప్పటికీ, చివరి వరకు పోరాడాలని నిర్ణయించుకున్నా.. మా జట్టులో ఇప్పటికే బ్యాటర్లు తక్కువగా ఉన్నారు, అందుకే బాధ్యత తీసుకున్నాను అని వెల్లడించాడు. 

ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో తనకున్న అనుబంధాన్ని హోప్ గుర్తు చేసుకుంటూ.. గ్రేట్ మ్యాన్ మహీ భాయ్ తో నాకు మంచి చర్చ జరిగింది. నీవు అనుకున్నదానికంటే ఎప్పుడూ ఎక్కువ సమయమే ఉంటుంది (You always have more time than you think) అని ఆయన చెప్పారు. ఆ మాటలే నాకు స్ఫూర్తినిచ్చాయి. లక్ష్యాన్ని చిన్న భాగాలుగా విడగొట్టుకుంటూ ముందుకు కొనసాగాను.. ఓవర్ రేట్ పెనాల్టీ కారణంగా భారత్ ఫీల్డర్లను లోపలికి తెస్తుందని నాకు తెలుసు, అందుకే ఓపిక పట్టాను అని హోప్ పేర్కొన్నాడు.  

రికార్డు ఛేదనతో విండీస్ ఘన విజయం: 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 రన్స్ భారీ స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ (129*), రోహిత్ శర్మ (92), రుతురాజ్ గైక్వాడ్ (57) అర్ధశతకాలు, శతకాలతో రాణించారు. అయితే 352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. కెప్టెన్ షాయ్ హోప్ శతకంతో (143 బంతుల్లో 162* పరుగులు) సంచలనం సృష్టించింది. అతనికి తోడుగా అమీర్ జాంగూ (67), కీమో పాల్ (44) విలువైన పరుగులు జోడించారు. దీంతో విండీస్ జట్టు 48.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.