హైదరాబాద్, బాగ్ లింగంపల్లి: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, తమలోని ప్రతిభను గుర్తించి అన్ని రంగాల్లో రాణించాలని అంబేద్కర్ కాలేజీ కరెస్పాండెంట్ సరోజా వివేక్ అన్నారు. బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో మహిళా సాధికారతపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.ఈ కార్యక్రమానికి సరోజా వివేక్, మార్గదర్శి చిట్స్ ఫండ్ ఎండీ శైలజా కిరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలపై విద్యార్థినులు, మహిళలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో శైలజా కిరణ్ మాట్లాడుతూ.. నాయకత్వం అంటే అధికారం చెలాయించడం కాదని అన్నారు. ఇతరుల అభిప్రాయాలను శ్రద్ధగా వినడం, వారి ఆలోచనలను గౌరవించడం, అవసరమైనప్పుడు ఇతరులకు అవకాశాలు కల్పించడమే నిజమైన నాయకత్వమన్నారు.నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరిలోనూ అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా మహిళలు తమపై తాము నమ్మకం పెంచుకుని ముందుకు సాగాలని సూచించారు. మహిళలు తమ సామర్థ్యాలను గుర్తించి నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
మహిళా సాధికారత కోసం శైలజా కిరణ్ అందిస్తున్న ప్రోత్సాహం, ఆమె ఆలోచనా విధానం మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని సరోజా వివేక్ అన్నారు. మహిళలు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, నాయకత్వం సహా అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేయాలని కార్యక్రమంలో వక్తలు సూచించారు. మహిళలు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగినప్పుడే సమాజంలో మరింత సానుకూల మార్పు సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థినులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
