వనపర్తి, వెలుగు : కొత్తకోట మండలం కానాయిపల్లి ఆర్ అండ్ ఆర్ కేంద్రంలోని సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కొత్తకోట మండలంలో ఆయన పర్యటించారు. ఆర్ అండ్ ఆర్ కేంద్రాన్నిసందర్శించి అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. లెవలింగ్ పనులు, వర్షపు నీరు సక్రమంగా వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు వంటి సమస్యలను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై ఆయన స్పందిస్తూ వెంటనే లెవలింగ్ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, వర్షపు నీరు నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు కొత్తకోట పీహెచ్ సీ తో పాటు జడ్పీహెచ్‌ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పదో తరగతి స్టూడెంట్లకు తప్పకుండా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. పాము కాటు ఘటనల్లో ప్రాణనష్టం జరగకుండా వైద్యాధికారులు అలర్ట్గా ఉండాలని సూచించారు.
