మారుతున్న హోమ్, కారు లోన్ రూల్స్.. ఈఎంఐ చెల్లింపులపై 4 నెలల్లో RBI కొత్త రూల్స్

మారుతున్న హోమ్, కారు లోన్ రూల్స్.. ఈఎంఐ చెల్లింపులపై 4 నెలల్లో RBI కొత్త రూల్స్

 

 

ఫ్లోటింగ్ వడ్డీ రేట్ కింద పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఒక కీలకమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. సాధారణంగా EMI భారం మారాలంటే ఏడాది సమయం పడుతుంటుంది, కానీ ఇకపై ఈ మార్పులను 3 నెలలకే పరిమితం చేయాలని RBI భావిస్తోంది. ఈ కొత్త ప్రతిపాదనలపై సెప్టెంబర్ 11, 2026 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కోరింది. ఒకవేళ ఇవి ఆమోదం పొందితే.. ఏప్రిల్ 1, 2027 నుంచి అమలులోకి వస్తాయి.

ఈ నిర్ణయం వల్ల వచ్చే మార్పులేంటి?
ప్రస్తుతం ఫ్లోటింగ్ రేట్ లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ రేటు ఒక బెంచ్‌మార్క్‌కు అనుసంధానించబడి ఉంటుంది. RBI ప్రతిపాదించిన ఈ కొత్త విధానం ప్రకారం.. బ్యాంకులు ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను రీసెట్ చేయాల్సి ఉంటుంది. అంటే మార్కెట్‌లో వడ్డీ రేట్లు తగ్గినా లేదా పెరిగినా.. ఆ ప్రభావం లోన్ చెల్లింపులు చేసేవారిపై చాలా వేగంగా పడుతుంది. దీనివల్ల వడ్డీ రేట్లు తగ్గితే లోన్ తీసుకున్న వారికి వెంటనే వడ్డీల భారం తగ్గి ఊరట లభిస్తుంది. ఒకవేళ పెరిగితే వడ్డీ భారం కూడా అంతే స్పీడుగా పెరుగుతుంది.

ఈఎంఐపై ప్రభావం ఎలా ఉంటుంది?
కొత్త ప్రతిపాదనతో వడ్డీ తగ్గుతుందని అర్థం కాదు. మార్కెట్ మార్పులకు అనుగుణంగా వడ్డీ రేట్లు త్వరగా సర్దుబాటు అవుతాయి అంతే. ఉదాహరణకు ఒక లోన్‌పై 8 శాతం వడ్డీ ఉన్నప్పుడు.. మార్కెట్ రేట్లు పడితే 3 నెలల వ్యవధిలోనే ఆ రేటు తగ్గి, మీరు చెల్లించే ఈఎంఐ భారం తగ్గే అవకాశం ఉంటుంది. అదే రేట్లు పెరిగితే.. పెరిగిన వడ్డీ భారానికి మీరు వెంటనే సిద్ధం కావాల్సి ఉంటుంది. అందుకే లోన్ తీసుకునేటప్పుడు కేవలం వడ్డీ రేటును మాత్రమే కాకుండా.. బెంచ్‌మార్క్, లోన్ వడ్డీ రేట్ల రీసెట్ ఫ్రీక్వెన్సీని కూడా గమనించాలి.

పాత లోన్ తీసుకున్న వారికి వర్తిస్తుందా?
పాత లోన్ తీసుకున్న వారు వెంటనే మారాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ ప్రతిపాదన ప్రకారం.. ప్రస్తుత లోన్లను కొత్త విధానంలోకి మార్చుకోవడానికి ఏప్రిల్ 1, 2029 వరకు సమయం ఉంది. అంతేకాకుండా ఇలా మారడానికి దరఖాస్తుదారుడి నుంచి బ్యాంకులు అనుమతి తీసుకోవటం తప్పనిసరి. బ్యాంకులు కొత్త మార్పు పేరుతో వడ్డీ రేట్లను పెంచడానికి వీల్లేదు. అలాగే లోన్ మారడానికి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ALSO READ : హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందా?

పర్సనల్, ఆటో లోన్ల పరిస్థితి ఏంటి?
రిజర్వు బ్యాంక్ తీసుకొస్తున్న కొత్త రూల్స్ ఎక్కువగా ఫ్లోటింగ్ రేట్ లోన్లకే వర్తిస్తాయి. చాలా వరకు పర్సనల్, ఆటో లోన్లు ఫిక్స్‌డ్ రేటుతో ఉంటాయి కాబట్టి.. వాటిపై ఈ మార్పుల ప్రభావం ఉండదు. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఫ్లోటింగ్ రేటుతో పర్సనల్, MSME లోన్లు తీసుకుంటే.. వాటిని తప్పనిసరిగా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఒకవేళ ఏదైనా బెంచ్‌మార్క్ ఆగిపోతే లోన్ తీసుకున్న వ్యక్తికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రత్యామ్నాయ బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేయాలని బ్యాంకులు సూచించాయి.

మొత్తానికి రిజర్వు బ్యాంక్ తీసుకున్న కొత్త నిర్ణయం లోన్ తీసుకునే వారిలో మరింత పారదర్శకతను పెంచుతుంది. మీరు లోన్ తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ డాక్యుమెంట్లలో రీసెట్ ఫ్రీక్వెన్సీ గురించి పూర్తిగా తెలుసుకోవడం ఇప్పుడు మరింత అవసరం అని మర్చిపోకండి కస్టమర్స్.