అమెజాన్‌కు గట్టి షాక్: 'అయోధ్య రామ మందిర్ ప్రసాద్' పేరుతో నకిలీ స్వీట్ల అమ్మకం.. రూ.1 లక్ష జరిమానా!

అమెజాన్‌కు గట్టి షాక్: 'అయోధ్య రామ మందిర్ ప్రసాద్' పేరుతో నకిలీ స్వీట్ల అమ్మకం.. రూ.1 లక్ష జరిమానా!

అయోధ్య రామ మందిర ప్రసాదం పేరుతో నకిలీ స్వీట్లను విక్రయించిన వ్యవహారంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ 'అమెజాన్'కు గట్టి షాక్ తగిలింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుండి ఎలాంటి అనుమతి లేకుండా సాధారణ స్వీట్లను "శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్" అని నమ్మించి అమ్మినందుకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) అమెజాన్‌కు రూ.1 లక్ష జరిమానా విధించింది. ఈ నేపథ్యంలోనే  అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.1 లక్ష ఫైన్ విధిస్తూ, ఈ మొత్తాన్ని 15 రోజుల్లోగా చెల్లించాలని సీసీపీఏ ఆదేశించింది.

ఏం జరిగిందంటే... చందు ట్రేడింగ్ కంపెనీ 'బిహార్ బ్రదర్స్'  అనే బ్రాండ్ కింద నెయ్యి లడ్డూలు, ఖోయా లడ్డూలు, బూందీ లడ్డూలు,  ఆవు పాల స్వీట్లను రామ మందిర ప్రసాదంగా అమెజాన్ సైట్లో విక్రయానికి పెట్టారు. దీనిపై  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) 2024 జనవరిలో చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన అథారిటీ, తాజాగా ఈ తీర్పు ఇచ్చింది.

ALSO READ : హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందా?

భక్తులు దేవుడి ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారని, ట్రస్ట్ అనుమతి లేకుండా వ్యాపారం కోసం ఈ పేరును వాడుకోవడం ప్రజలను  మోసం చేయడమే కాకుండా, కోట్లాది మంది మతపరమైన భావాలను దెబ్బతీయడమేనని స్పష్టం చేసింది. ఈ ఉత్పత్తులను ప్రదర్శించి అమ్మకాలను ప్రోత్సహించినందుకు అమెజాన్ కూడా ఈ మోసంలో భాగస్వామేనని.. ఐటీ చట్టం కింద మినహాయింపులు దీనికి వర్తించవని తేల్చిచెప్పింది.