24 గంటల్లోనే విజయ్ సర్కార్ యూ-టర్న్.. విద్యార్థుల నిరసనల నిషేధ జీవో రద్దు

24 గంటల్లోనే  విజయ్ సర్కార్ యూ-టర్న్.. విద్యార్థుల నిరసనల నిషేధ జీవో రద్దు

చెన్నై: విద్యార్థుల నిరసనలపై విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వామపక్ష పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించే రాజకీయ నిరసనల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొనకుండా నిరోధించాలని జారీ చేసిన జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ జీవోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో జారీ చేసిన 24 గంటల్లోనే టీవీకే సర్కార్ సర్క్యూలర్‎ను రద్దు చేయడం గమనార్హం.

వివాదం ఏంటంటే..?

వామపక్ష పార్టీలు, తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ విభాగం (TNCJP) ఆధ్వర్యంలో జరిగే ఆందోళనల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొనకుండా నిరోధించాలని టీవీకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, పోలీసులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఆగస్ట్ 17న ప్రభుత్వం జీవో జారీ చేసింది.

 అదేవిధంగా ఇటీవల జరిగిన నిరసనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. రాజకీయ పార్టీల ఆందోళనల్లో విద్యార్థులు పాల్గొనటంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం.. భవిష్యత్తులో ఇలాంటి నిరసనలకు విద్యార్థులను దూరంగా ఉండేలా చూడాలని సంబంధిత శాఖలను ఆదేశించింది. 

విద్యార్థులు నిరసనల్లో పాల్గొనకుండా నిరోధించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. లెఫ్ట్ వింగ్, సీజేపీ విజయ్ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ ఉత్తర్వులు విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డాయి. ప్రభుత్వం వెంటనే వివాదస్పద జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

ALSO READ : మారుతున్న హోమ్, కారు లోన్ రూల్స్..

విజయ్ సర్కార్ యూ టర్న్:

విద్యార్థులు నిరసనల్లో పాల్గొనకుండా నిషేధించాలన్న సర్క్యూలర్‎పై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో విజయ్ సర్కార్ యూ టర్న్ తీసుకుంది. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడంత కేవలం 24 గంటల్లోనే ప్రభుత్వం ఆ జీవోను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి. సింథియా సెల్వి ఈ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు అన్ని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లకు అధికారికంగా ఉత్తర్వులు పంపారు.