సక్సెస్ కావడానికి దుర్మార్గపు పనులు చేసే సొసైటీలో మనం బతుకుతున్నాం. ఇక్కడ ఎవరి స్వార్థం కోసం వాళ్లే పని చేస్తుంటారు. ఇలాంటి లోకంలో క్షమించడం అనేది బలహీనతగా, పిరికితనంగా పరిగణిస్తుంటారు చాలామంది. ఎందుకంటే 'ఎదురు తిరగండి. శిక్షించండి. పగ తీర్చుకోండి' ఈ మాటలు చెప్పేవాళ్లే ఎక్కువమంది!
క్షమించడమే బలం
ఈ ప్రపంచంలో రెండు రకాల శక్తులు ఉన్నాయి. ఒక శక్తి ద్వేషించడానికి, చంపడానికి, బాధపెట్టడానికి, గాయపర్చడానికి, నాశనం చేయడానికి కాగా, మరో శక్తి ప్రేమించటానికి, క్షమించటానికి, నయం చేయడానికి ఉంది. అవును! మనం ప్రేమించటానికి భయపడకూడదు. ఎందుకంటే... దీనికి ధైర్యం అవసరం. అలాగే, క్షమించటానికి కూడా అంతే ధైర్యం కావాలి.
క్షమించటం బలహీనతకు, అమాయకత్వానికి సంకేతం కాదని.. నిజం చేయాలంటే, దీనికి ధైర్యం, దానిపై ఒక క్లారిటీ అవసరం. క్షమించడం అన్నింటికంటే శక్తివంతమైనది. ఇది ఆధ్యాత్మిక శక్తి మాత్రమే కాదు, ఎవరూ అంగీకరించకుండా ఉండలేని శక్తి కూడా! ఇది మన గౌరవాన్ని, విలువని, ఇంటర్నల్ స్ట్రెంత్ ని తెలియజేస్తుంది. అందరూ అనుకున్నట్టుగా బలహీనులుగా కాకుండా... క్షమించేగుణం మనల్ని మరింత స్ట్రాంగ్గా మారుస్తుంది. ఎందుకంటే ఇది కోపం, ద్వేషం, పగ తాలూకు చిక్కుముడిని విప్పి... యూనిటీ, శాంతిని తీసుకురావడానికి సాయపడుతుంది. ముఖ్యంగా మనం ఇతరులను క్షమించడం వల్ల.. వాళ్లలో కూడా క్షమాగుణం పెరుగుతుంది. ఇదొక చైన్ లాగా పెరుగుతూ పోతుంది.
మహర్షి ఆశ్రమంలో...
ఒకసారి, రాత్రిపూట రమణ మహర్షి ఆశ్రమంలో దొంగలు పడ్డారు. మహర్షికి చాలామంది సంపన్నులు ఫాలోవర్స్ గా ఉన్నారు. వాళ్లు తరచుగా ఆశ్రమానికి వచ్చిపోతూ ఉండేవారు.. వాళ్లు కానుకలు ఇచ్చిపోతారు.. కాబట్టి, ఆశ్రమంలో ధనరాశులు ఉంటాయని అనుకున్నారు దొంగలు. సడెన్ గా వాళ్లు లోపలి గదిలోకి ప్రవేశించారు. ధ్యానంలో కూర్చున్న మహర్షిని లేపి.. అసభ్యంగా తిట్టారు. డబ్బు. విలువైన వస్తువులు ఎక్కడున్నాయో చెప్పమని గొడవ చేశారు. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఆయన్ను కొట్టడం మొదలు పెట్టారు. ఈ గందరగోళంతో మేల్కొన్న కొద్ది మంది శిష్యులు మహర్షి గదిలోకి పరిగెత్తారు. గాయపడ్డ గురువును చూసి భయపడ్డారు. చూస్తుండగానే.. దొంగలు వాళ్లకు కావాల్సిన వాటిని ఎత్తుకుపోయారు.
మా గురువు మీదే చెయ్యి చేసుకుంటారా? అనుకుంటూ శిష్యులు కర్రలు, రాళ్లు చేతిలో పట్టుకొని.. దొంగలను వెంబడించాలి అనుకున్నారు. దానికి సిద్ధం అవుతుండగా 'వద్దు... వాళ్ల వెంట వెళ్లొద్దు' అన్నాడు రమణ మహర్షి. 'ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మీ పళ్లు... నాలుకను కొరికితే వాటిని తీసేస్తారా?' అని అడిగాడు. ' అలాగే, మనమంతా మనుషులం... ఈ కాస్మిక్ చైన్ లో అందరం ముడిపడి ఉన్నాం. మనమంతా ఒక్కటే అయినప్పుడు.. కోపానికి, ద్వేషానికి స్థానం ఎక్కడుంది?" అని అడగడంతో శిష్యులకు లోతైన ఆధ్యాత్మిక పాఠం అర్థమైపోయింది.
ALSO READ : నీతి కథ : కొడుకు ప్రాణం పీత కాపాడుతుందని అమ్మకు ముందే తెలుసా!
రెండు సమాధులు తవ్వాలి
'ఎవరైతే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారో.. వాళ్లు రెండు సమాధులు తవ్వాలి' అని ఓ చైనా సామెత. క్షమించలేకపోవడం ఎంత ఘోరమైందో దీన్ని బట్టే అర్థమవుతుంది. క్షమించకపోతే.. ఆ పరిస్థితికి కారణమైన ఇద్దరు వ్యక్తుల్నీ ద్వేషం తినేస్తుంది. ప్రతీకారం తీర్చు కోవాలని ఎదురుచూస్తుంటే.. ముందు మనల్ని మనం తినేయడానికి అనుమతిచ్చినట్టే. పగ మనల్ని సంతోషపెట్టడు. కోపంతో సంతృప్తి పొందినవాళ్లని ఎక్కడైనా చూశారా? కానీ, క్షమించడం వల్ల సంతృప్తి, శాంతి లభిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షమ అనేది ఒక మంచి గుణం. ఇతరుల పనులకు, చెడు ప్రవర్తనకు ప్రతికూలంగా స్పందించే భారం నుంచి... మనసుకు ఉపశమనం కలిగిస్తుంది. క్షమించడం వల్ల హృదయంలో మరింత కరుణ పెరుగుతుంది. ఇది మనల్ని ప్రకాశింపజేస్తుంది. మనుషుల్ని, ఈ ప్రపంచాన్ని మరింత ప్రేమించేలా చేస్తుంది.
:: కర్టసీ- దాదా వాస్వాని
