- వరంగల్ డిస్కం పరిధిలో 392 కెపాసిటర్లు ఏర్పాటు
- గ్రామీణ ఫీడర్లపై ఇండక్షన్ లోడ్ సమస్యకు చెక్
- వరంగల్ ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 14 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు మెరుగైన సప్లైకి చర్యలు
- కెపాసిటర్ల ఏర్పాట్లతో సుమారు రూ.103 కోట్లు ఆదా
వరంగల్, వెలుగు: టీజీఎన్‌పీడీసీఎల్ పరిధిలోని రైతులకు వ్యవసాయానికి నాణ్యమైన, స్థిరమైన విద్యుత్ అందించేందుకు టీజీఎన్‍పీడీసీఎల్ సరికొత్త అడుగులు వేసింది. వోల్టేజీ మెరుగుపరిచి విద్యుత్ నష్టాలు తగ్గించి గ్రామీణ ప్రాంతాల్లో క్వాలిటీ కరెంట్ సప్లై కోసం కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వీటి ద్వారా పీటీఆర్ ఏర్పాట్ల అవసరాన్ని తగ్గించారు. అటవీ ప్రాంతాల్లో 8 వోల్టేజీ బూస్టర్ల ఏర్పాటుతో వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందేలా చర్యలు తీసుకున్నారు.
14 లక్షల వ్యవసాయ పంపుసెట్లు
ఎన్‍పీడీసీఎల్ పరిధిలో రైతులకు సంబంధించి సుమారు 14 లక్షల వ్యవసాయ పంపుసెట్లు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామీణ ఫీడర్లపై ఇండక్షన్ లోడ్ పడుతోంది. తద్వారా పవర్ ఫ్యాక్టర్ తగ్గి, కరెంట్ సప్లైతోపాటు వోల్టేజీ డ్రాప్ సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో సాగుకు నాణ్యమైన, స్థిరమైన కరెంట్ అందించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేగాక సాంకేతికపరంగా ఈ సమస్యలను పరిష్కరించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఈక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మోటార్ల వల్ల ఏర్పడే రియాక్టివ్ పవర్ డిమాండ్‍ను నియంత్రించేందుకు సబ్‍స్టేషన్లు, 11 కేవీ ఫీడర్ల వద్ద కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 33/11 కేవీ సబ్ స్టేషన్లలో 2 ఎంవీఏఆర్ స్థాయి 303 కెపాసిటర్ బ్యాంకులు, 1 ఎంవీఏఆర్ ప్రాంతాల్లో మరో 89 ఏర్పాటు చేశారు.
సబ్‍స్టేషన్ స్థాయిలో 2 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులకుతోడు 11 కేవీ ఫీడర్ స్థాయిలో 600 కేవీఏఆర్ సామర్థ్యం కలిగిన కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటుతో ఆ ప్రాంతాలకు వెళ్లే విద్యుత్ లైన్లలో వోల్టేజీ డ్రాప్ సమస్యలు తగ్గాయి. తద్వారా అటవీ ప్రాంతాలు, పొడవైన లైన్లు ఉండే ఫీడర్ చివరి ప్రాంతాల్లోనూ వోల్టేజీ ప్రొఫైల్ మెరుగుపడుతోంది. ఫలితంగా వ్యవసాయ పంపుసెట్లకు, ఇతర వినియోగదారులకు విద్యుత్ సేవల్లో అంతరాయం తగ్గి స్థిరమైన వోల్టేజీ అందడానికి వీలైంది.
నష్టాల తగ్గింపు
ఎన్‍పీడీసీఎల్ పరిధిలో 392 కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటుతో పీటీఆర్ సామర్థ్యం పెరుగుతోంది. దీనివల్ల వెంటనే అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దాదాపు 66 కొత్త పీటీఆర్‍ల ఏర్పాటుతో నష్టాలు తగ్గి రూ.21 కోట్ల డబ్బులు ఆదా అయిందని అధికారులు తెలిపారు. 11 కేవీ ఫీడర్లలో కెపాసిటర్ బ్యాంకులు పెట్టడంతో సుమారు రూ.82 కోట్ల సాంకేతికపరమైన ఖర్చు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ ఎన్‍పీడీసీఎల్ విద్యుత్ నష్టాలను భారీగా తగ్గించుకునేందుకు దోహదపడ్డాయి.
కెపాసిటర్ బ్యాంకులతో నాణ్యమైన విద్యుత్
టీజీఎన్‍పీడీసీఎల్ పరిధిలోని వ్యవసాయ ఆధారిత విద్యుత్ వోల్టేజీ మెరుగుపరచడానికి 392 కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేశాం. వీటి ఏర్పాటుతో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీని ద్వారా సుమారు రూ.103 కోట్లు ఆదా అయింది. దీంతోపాటు విద్యుత్ నష్టాలు తగ్గాయి. అటవీ ప్రాంతాలు, సుదూర ప్రాంతాల్లోనూ మెరుగైన, స్థిరమైన విద్యుత్ అందించేందుకు మొత్తంగా 8 బూస్టర్లు ఏర్పాటు చేశాం.
-కర్నాటి వరుణ్‍రెడ్డి, సీఎండీ, టీజీఎన్‍పీడీసీఎల్
