- లబ్ధిదారుల నుంచి సేకరించి మిల్లులకు విక్రయాలు
- మూతబడిన మిల్లులో బియ్యం డంపులు
- రేగొండ మూత పడిన మిల్లులో 444.75 క్వింటాళ్ల...
- పీడీఏస్ బియ్యం నిల్వలను గుర్తించిన సివిల్ సప్లై అధికారులు
జయశంకర్ భూపాలపల్లి/ రేగొండ, వెలుగు : సీఎంఆర్ మిల్లర్లు బియ్యం దందాకు తెరలేపారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన బియ్యంలో భారీగా బకాయిలు ఉండటంతో ఆ లోటును పూడ్చుకునేందుకు రేషన్ బియ్యంపై కన్నేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొందరు మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి గ్రామాల్లో లబ్ధిదారులు, రేషన్ డీలర్ల నుంచి బియ్యాన్ని సేకరించి, మూతపడిన మిల్లుల్లో నిల్వ చేసి, అక్కడి నుంచి సీఎంఆర్ మిల్లులకు తరలిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రేగొండ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో మూతపడిన ఓ రైస్‌మిల్లులో భారీగా బియ్యం నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్లు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 444.75 క్వింటాళ్ల బియ్యం పట్టుబడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
సిండికేట్‌గా దందా?
సీఎంఆర్ బకాయిలు చెల్లించని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆఫీసర్లు మిల్లుల్లో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. దీంతో బకాయిలు తీర్చేందుకు కొందరు మిల్లర్లు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎంఆర్ మిల్లింగ్ చేసే కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి బియ్యం సేకరణకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రేగొండ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఓ మూతపడిన మిల్లును లీజుకు తీసుకున్న వ్యాపారులు అక్కడ బియ్యాన్ని డంప్ చేసి, ఆర్డర్లకు అనుగుణంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కొందరు లబ్ధిదారులు, డీలర్ల నుంచి కిలో రూ.20 చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేసి, ప్యాకింగ్ అనంతరం కిలో రూ.30 చొప్పున మిల్లర్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రాత్రి వేళల్లో ట్రాలీ ఆటోల ద్వారా బియ్యాన్ని మూతపడిన మిల్లులకు తరలించి, అక్కడ సీఎంఆర్ సంచుల్లో ప్యాకింగ్ చేసి లారీల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇతర రైస్‌మిల్లులకు చేరవేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. సీఎంఆర్ బియ్యం బకాయిలతో ఇబ్బందులు పడుతున్న మిల్లర్లతో ఒప్పందాలు చేసుకుని, వారి లోటును ఈ విధంగా భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
93,952 మెట్రిక్ టన్నుల బకాయిలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2025-–26 సంవత్సరానికి సంబంధించి 13 బాయిల్డ్ రైస్ మిల్లులు, 39 రా రైస్ మిల్లుల నుంచి ఖరీఫ్, యాసంగి సీజన్లకు కలిపి 93,952 టన్నుల బియ్యం బకాయిలు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఖరీఫ్ లో 27 మిల్లులకు 1.17 లక్షల టన్నుల ధాన్యం కేటాయించారు. మిల్లర్లు 78,461 టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 20,703 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించారు.
ఈ సీజన్లో ఇంకా 49,758 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి ఉంది. యాసంగిలో 85,134 టన్నుల ధాన్యం కేటాయించగా, దాని నుంచి 57,679 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఇప్పటివరకు 13,485 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించగా, మరో 44,194 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి ఉంది. మిల్లర్లు బియ్యం అప్పగించేందుకు ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. ప్రతి ఏటా ధాన్యం నిల్వలను రొటేషన్ చేసే మిల్లర్లకు ఈసారి వర్షాభావ పరిస్థితులు, ధాన్యం దిగుబడి తగ్గే అవకాశాలు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.
దీంతో కొందరు రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు మిల్లుల్లో ధాన్యం నిల్వలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహిస్తుండగా, ధాన్యం మాయమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల చిట్యాల మండలం గిద్దెముత్తారంలోని వైష్ణవి రైస్‌మిల్లులో 1,428.314 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.3.99 కోట్లుగా నిర్ధారించి మిల్లర్‌పై కేసు నమోదు చేశారు.
444.75 క్వింటాళ్ల బియ్యం సీజ్
రేగొండ కేంద్రంగా జరుగుతున్న బియ్యం దందాపై సివిల్ సప్లై ఆఫీసర్లు బుధవారం దాడులు చేశారు. మండల కేంద్రంలోని పీఎస్‌కు సమీపంలోని మూతపడిన మిల్లులో తనిఖీలు చేపట్టగా భారీగా బియ్యం నిల్వలు బయటపడ్డాయి. డీఎస్‌వో రవికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ప్రభుత్వం సరఫరా చేసే గన్నీ సంచుల్లో నింపిన బియ్యం గుర్తించారు.
మొత్తం 444.75 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన బియ్యాన్ని లారీల ద్వారా సమీపంలోని సీఎంఆర్‌కు కేటాయించిన మారుతి మిల్లుకు తరలించారు. గోదాం యజమాని శ్రీనివాస్, వెహికల్ ఓనర్ తూర్పటి శ్రీనివాస్, సాంబశివుడిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనల నేపథ్యంలో ఆఫీసర్లు మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఈ వ్యవహారం వెనుక ఉన్న నెట్‌వర్క్ బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.
