- ప్రజల అంగీకారంతోనే రోడ్డు విస్తరణ పనులు
- రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
- రూ.2కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి, ఎంపీ
కోల్‌బెల్ట్/కోటపల్లి/చెన్నూరు,వెలుగు: విద్యారంగంపై పెట్టే ఖర్చు విద్యార్థుల భవిష్యత్‌కు పెట్టుబడిలాంటిదని, ప్రభుత్వం కల్పించే విద్య అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, మందమర్రి మండలాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రూ.2 కోట్లతో కోటపల్లి మండల కేంద్రంలో బాలికల ఆశ్రమ పాఠశాలలో టాయిలెట్స్, స్నానపు గదులు, రిపేర్లు, చెన్నూరు మండలం క్రిష్టంపేట గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బిల్డింగ్ రెనోవేషన్, క్యాతనపల్లి మున్సిపాలిటీ ఐదో వార్డు అమరవాది గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ చెన్నూరు మండలం సోమనపల్లిలో రూ.250 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. చెన్నూర్ మండల కేంద్రంలో నిర్మించిన 100 పడకల హాస్పిటల్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. చెన్నూరులో రోడ్డు విస్తరణ పనుల విషయంలో ప్రజలతో చర్చలు జరిపామని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తున్నారన్నారు. అభివృద్ది పనుల్లో ఉపాధి కోల్పోయే వారికి ప్రత్యామ్నాయంగా షాపులు కేటాయిస్తామన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు, ఫిర్యాదుల కోసం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన విద్యాహక్కును రాష్ట్రంలో సమర్థవంతంగా అమలుచేస్తున్నామన్నారు. బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా స్కూళ్ల అభివృద్ధికి మంత్రి వివేక్ వెంకటస్వామి కృషి చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎగ్జామ్ పేపర్ లీక్ చేసినందుకు ఢిల్లీలో విద్యార్థులు వారి హక్కుల కోసం పోరాటం చేశారని, ఈ ఆందోళనల్లో తాము కూడా పాల్గొన్నట్లు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ కుమార్‌దీపక్, డీసీపీ భాస్కర్, ఏసీపీ కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు మారుతీప్రసాద్, మురళీకృష్ణ, క్యాతనపల్లి వైస్ చైర్‌పర్సన్ మిట్టపల్లి సరిత పాల్గొన్నారు.
వార్డుల్లో మంత్రి మార్నింగ్ వాక్
చెన్నూరు మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చెన్నూరు కాంగ్రెస్ లీడర్ అన్వర్ మామా అబ్దుల్ రఫీ ఇటీవల చనిపోగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
