టిమ్స్ ప్రారంభమైన తర్వాత అక్కడికి వెళ్లేందుకు ఏంపని?..హరీశ్‌‌ రావుపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్

టిమ్స్ ప్రారంభమైన తర్వాత అక్కడికి వెళ్లేందుకు ఏంపని?..హరీశ్‌‌ రావుపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్

హైదరాబాద్, వెలుగు: సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన తర్వాత అక్కడికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు,  హరీశ్ రావుకు ఏంపని అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం టిమ్స్  హాస్పిటల్‌లో వందలాది మంది రోగులు చికిత్స పొందుతున్నారని, ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్తే రోగులకు ఇబ్బందులు కలగవా అని ప్రశ్నించారు. ఈ మేరకు  బుధవారం సీఎల్పీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడిపల్లి సత్యం మాట్లాడారు. ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడం  హరీశ్ రావుకు అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్  ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలకు ఎందుకు కడుపుమంట అని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉంటూ, ప్రజా సంక్షేమ పాలన అందిస్తోందని తెలిపారు. ప్రజలంతా సంతోషంగా ఉన్న ఈ సమయంలో బీఆర్ఎస్ నాయకులు ఏదో ఒక రకంగా గందరగోళం సృష్టించి పాలనను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా సుపరిపాలను అందించడంలో వెనక్కి తగ్గబోమని పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన టిమ్స్ ఆస్పత్రులను కూడా ప్రారంభిస్తామని, అది చూసి బీఆర్ఎస్ నేతలు మరింత ఈర్ష్యతో కుమిలిపోవాల్సి వస్తుందని మేడిపల్లి సత్యం ఎద్దేవా చేశారు.