ఎర్రుపాలెం, వెలుగు : గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో రూ.12.89 కోట్లతో చేపట్టనున్న రోడ్ల పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయంతి రోడ్డు నుంచి జమలాపురం రోడ్డు వరకు బీటీ రహదారి నిర్మాణానికి రూ.5.35 కోట్లు, రామాపురం నుంచి కొత్తపాలెం వరకు రూ.6.15 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఎస్సీ కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేశామని, రేమిడిచర్ల ఎస్సీ కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం జమలాపురంలోని వాసిరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల పార్టీ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఆఫీసర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో తొమ్మిది స్కూళ్లను ఆధునికీకరించి మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దుతున్నామని ఇందుకోసం రూ. 57.69 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. మధిరలో నియోజకవర్గంలో 10 వేల మంది మహిళలకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
వసతులు కల్పించాలంటూ మహిళల నిరసన
ఎర్రుపాలెం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు మహిళలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు. కాలనీలో ఏండ్లుగా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపిస్తూ తాగునీరు, డ్రైనేజీ, వీధిలైట్లు, అంతర్గత రహదారులు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం వినతిపత్రం అందజేశారు
