ఆసియాన్ చాంపియన్‌షిప్‌లో అండర్-11 బాలికల జట్టుకు బ్రాంజ్
సెయింట్ లూయిస్/ముంబై: అంతర్జాతీయ చెస్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ప్రతిష్ఠాత్మక సింక్‌ఫీల్డ్ కప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద జాయింట్ లీడ్‌లో అగ్రస్థానానికి చేరుకోగా, సింగపూర్‌లో జరిగిన ఆసియాన్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత అండర్–11 బాలికల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించింది. సింక్‌ఫీల్డ్ కప్ ఎనిమిదో రౌండ్‌లో ప్రజ్ఞానంద.. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మాక్సిమ్ వాచియర్-లాగ్రేవ్‌ను చిత్తు చేశాడు. ఈ విజయంతో ఎనిమిది రౌండ్లలో ఐదు పాయింట్లు సాధించి అమెరికాకు చెందిన వెస్లీ సోతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు.
అంతేకాకుండా ఈ ఏడాది చివర్లో జరిగే గ్రాండ్ ఫినాలేలో స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. రుయ్ లోపెజ్ ఓపెనింగ్‌లో సాగిన పోరులో ప్రత్యర్థి చేసిన పీస్ త్యాగాన్ని సమర్థంగా ఎదుర్కొన్న ప్రజ్ఞానంద కేవలం 28 ఎత్తుల్లోనే విజయాన్ని అందుకున్నాడు. చివరి రౌండ్‌లో తెల్లపావులతో నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనీష్ గిరితో తలపడనున్నాడు.
మరోవైపు సింగపూర్‌లో జరిగిన ఆసియాన్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత అండర్–11 బాలికల జట్టు 14.5 పాయింట్లతో బ్రాంజ్ మెడల్‌ను కైవసం చేసుకుంది. ఏపీకి చెందిన వరేణ్య లక్ష్మివాకా, అలిగిరి అమృత హేమల్, ముంబైకి చెందిన మాయా సిద్ధార్థ్ నరులా భారత జట్టులో ఉన్నారు. 27 దేశాల నుంచి 700 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో వియత్నాం 19.5 పాయింట్లతో గోల్డ్‌కు, సింగపూర్‌కు సిల్వర్, భారత్‌కు బ్రాంజ్ దక్కాయి.
