బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్: ప్రిక్వార్టర్స్లోకి పీవీ సింధు, ఆయుష్ శెట్టి

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్: ప్రిక్వార్టర్స్లోకి పీవీ సింధు, ఆయుష్ శెట్టి
  • లక్ష్యసేన్‌‌కు షాక్‌‌.. సాత్విక్‌‌–చిరాగ్‌‌కు వాకోవర్‌‌

న్యూఢిల్లీ: బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ బ్యాడ్మింటన్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో భారత స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు, యువ ఆటగాడు ఆయుష్‌‌ శెట్టి ప్రిక్వార్టర్స్‌‌కు దూసుకెళ్లారు. అయితే 2021 వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ బ్రాంజ్‌‌ మెడలిస్ట్‌‌ లక్ష్యసేన్‌‌ రెండో రౌండ్‌‌లోనే ఓడి నిరాశపరిచాడు. మహిళల సింగిల్స్‌‌ రెండో రౌండ్‌‌లో తొమ్మిదో సీడ్‌‌ సింధు 21–16, 21–17తో కెనడాకు చెందిన వెన్‌‌ యు జాంగ్‌‌ను వరుస గేముల్లో ఓడించింది. ఆరో వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ పతకంపై కన్నేసిన 2019 చాంపియన్‌‌ సింధు.. ప్రిక్వార్టర్స్‌‌లో చైనా మూడో సీడ్‌‌ వాంగ్‌‌ జి యితో తలపడనుంది.

పురుషుల సింగిల్స్‌‌లో ఆయుష్‌‌ శెట్టి 21–8, 21–10తో శ్రీలంకకు చెందిన దుమిందు అబేవిక్రమను చిత్తు చేశాడు. తదుపరి రౌండ్‌‌లో ఇండోనేసియాకు చెందిన అల్వీ ఫర్హాన్‌‌తో తలపడనున్నాడు. మరోవైపు లక్ష్యసేన్‌‌కు అమెరికా షట్లర్‌‌ గారెట్‌‌ టాన్‌‌ షాకిచ్చాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌‌లో లక్ష్య 21–19, 19–21, 17–21తో ఓడిపోయాడు. తొలి గేమ్‌‌ను గెలిచిన లక్ష్య.. తర్వాతి రెండు గేముల్లో టాన్‌‌ వేగం, దూకుడును ఎదుర్కోలేకపోయాడు.

మూడో గేమ్‌‌లో 4–12తో వెనుకబడిన లక్ష్య 15–17 వరకు పుంజుకున్నా విజయాన్ని అందుకోలేకపోయాడు. మహిళల సింగిల్స్‌‌లో వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ అరంగేట్రం చేసిన ఉన్నతి హుడా 21–11, 9–21, 21–23తో కెనడా 12వ సీడ్‌‌ మిచెల్‌‌ లీ చేతిలో పోరాడి ఓడింది. పురుషుల డబుల్స్‌‌లో సాత్విక్‌‌సాయిరాజ్‌‌ రంకిరెడ్డి–చిరాగ్‌‌ శెట్టి జోడీకి వాకోవర్‌‌ లభించడంతో ప్రిక్వార్టర్స్‌‌కు చేరింది. మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్‌‌ కపిల జోడీ 21–11, 21–11తో మకావు జోడీని ఓడించి రౌండ్‌‌ ఆఫ్‌‌–16లోకి ప్రవేశించింది.