నాగర్ కర్నూల్ : ఆహార భద్రత చట్టం అమలులో నిర్లక్ష్యం చేయొద్దు

నాగర్ కర్నూల్ : ఆహార భద్రత చట్టం అమలులో నిర్లక్ష్యం చేయొద్దు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఆహార భద్రత చట్టం అమలులో నిర్లక్ష్యం చేయొద్దని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్​లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తో కలిసి మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ దుకాణాలు, పాఠశాలలు, అంగన్​వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల్లో పథకాలు అమలు చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో ఎక్కడైనా లోపాలు కనిపిస్తే వాటిని తక్షణమే సరిదిద్దాలన్నారు. 

ప్రతి విద్యార్థికీ హెల్త్ ప్రొఫైల్ అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ లబ్ధిదారులకు అందుతున్న బియ్యం ఇతర నిత్యవసరకుల పంపిణీ విధానాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. అంతకుముందు కల్వకుర్తి పట్టణంలో రేషన్ దుకాణం, బాలుర ఉన్నత పాఠశాల, అంగన్​వాడీ కేంద్రాలు, కాలేజీ సందర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఆనంద్, శారద, అదనపు కలెక్టర్ చెన్నయ్య, దేవసహాయం, డీఆర్​డీఏ చిన్న ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.