రైతుల ఇండ్లకు వెళ్లి లోన్లు ఇవ్వాలి..ఎస్‌‌ఎల్‌‌బీసీ సమావేశంలో బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

రైతుల ఇండ్లకు వెళ్లి లోన్లు ఇవ్వాలి..ఎస్‌‌ఎల్‌‌బీసీ సమావేశంలో బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
  • ఎంఎస్‌‌ఎంఈలకు సకాలంలో చవకైన రుణాలు ఇవ్వాలని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రైతులకు ఎప్పుడు రుణాలు అవసరమో అప్పుడే వారి ఇండ్లకు వెళ్లి బ్యాంకులు లోన్లు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బ్యాంకర్లను ఆదేశించారు. అర్హులైన రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. గురువారం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌‌లో జరిగిన 50వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌‌ఎల్‌‌బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘తెలంగాణ రైజింగ్‌‌ 2047’ విజన్‌‌ ఆధారంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్‌‌ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్‌‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి చెప్పారు. ఈ లక్ష్య సాధనలో బ్యాంకింగ్‌‌ రంగం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. బ్యాంకులు ఎంత రుణాలు ఇచ్చాయన్నది మాత్రమే కాకుండా.. ఆ రుణాలతో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, గ్రామీణ ప్రజల ఆదాయం ఎంత పెరిగిందన్నదే అసలైన కొలమానమని అన్నారు.

రైతులు రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే కేవలం రికవరీ చర్యలకే పరిమితం కావద్దని బ్యాంకర్లకు సూచించారు. రైతుల ఆదాయం ఎందుకు తగ్గిందో విశ్లేషించి, అవసరమైన సాయం అందించాలని చెప్పారు.

 ప్రత్యేక రుణ వ్యూహాలు అమలు చేయాలి..

రాష్ట్రంలో ఎంఎస్‌‌ఎంఈల బలోపేతంతో పాటు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రుణ వ్యూహాలు అమలు చేయాలని భట్టి సూచించారు. తెలంగాణలోని ప్రాంతాల స్వభావాన్ని బట్టి ‘క్యూర్‌‌, ప్యూర్‌‌, రేర్‌‌’ విధానంలో ప్రణాళికలు రూపొందించాలన్నారు. ‘క్యూర్‌‌’ పరిధిలోని ఏఐ, లైఫ్‌‌ సైన్సెస్‌‌, ఏరోస్పేస్‌‌ వంటి నాలెడ్జ్‌‌ రంగాలకు, ‘ప్యూర్‌‌’ పరిధిలోని తయారీ, పారిశ్రామిక క్లస్టర్లు, మౌలిక వసతులకు, ‘రేర్‌‌’ పరిధిలోని వ్యవసాయం, ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌, గ్రామీణ పరిశ్రమలకు సకాలంలో చవకైన రుణాలు అందించాలని ఆదేశించారు.

ఎంఎస్‌‌ఎంఈ రంగానికి మంజూరైన రుణాలను నిర్ణీత గడువులోగా పంపిణీ చేయాలని చెప్పారు. సీజీటీఎంఎస్‌‌ఈ కింద మంజూరయ్యే రుణాలకు పూచీకత్తు పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దని స్పష్టం చేశారు. జూన్‌‌ 2026 నాటికి బ్యాంకులు వ్యవసాయ రంగానికి రూ.52,337 కోట్ల రుణాలు అందించడం అభినందనీయమని అన్నారు. అయితే ఈ సాయం రైతులకు సకాలంలో అందడమే అత్యంత ముఖ్యమని చెప్పారు. ప్రజాధనం పొదుపు, ఆర్థిక సమానత్వం సాధించడమే నిజమైన ఫైనాన్షియల్‌‌ ఇంక్లూజన్‌‌ అని భట్టి అన్నారు. రాష్ట్రంలో సుమారు 19.13 లక్షల జన్‌‌ధన్‌‌ ఖాతాలు జీరో బ్యాలెన్స్‌‌తో ఉండటంపై సమీక్షించాలని కోరారు.

గ్రామాల్లో నిష్క్రియంగా ఉన్న బిజినెస్‌‌ కరస్పాండెంట్లను వెంటనే క్రియాశీలం చేయాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాలను కేవలం బ్యాంక్‌‌ లింకేజీలకే పరిమితం చేయకుండా ‘ఎంటర్‌‌ప్రైజ్‌‌ ఫైనాన్స్‌‌’ ద్వారా మైక్రో ఎంటర్‌‌ప్రైజెస్‌‌గా తీర్చిదిద్దాలని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకులకు రావాల్సిన రీయింబర్స్‌‌మెంట్లను సకాలంలో చెల్లించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని భట్టి హామీ ఇచ్చారు.

భవిష్యత్‌‌ అవసరాలకు అనుగుణంగా ‘తెలంగాణ రైజింగ్‌‌ 2047 బ్యాంకింగ్‌‌ రోడ్‌‌మ్యాప్‌‌’ రూపొందించాలని ప్రతిపాదించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌‌ స్పెషల్‌‌ చీఫ్‌‌ సెక్రటరీ దానకిషోర్‌‌, ఫైనాన్స్‌‌ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ సందీప్‌‌కుమార్‌‌ సుల్తానియా, సెర్ప్‌‌ సీఈఓ దివ్య, నాబార్డ్‌‌ సీజీఎం చిన్మయ్‌‌కుమార్​, ఎస్బీఐ సీజీఎం నీలేష్ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.