హైదరాబాద్, వెలుగు : ఎల్-నినో ముప్పును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఒక రోజు రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాజేంద్రనగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (టీజీఐఆర్డీ) వేదికగా శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వర్క్షాప్నిర్వహించనుంది.
వీబీ జీ రామ్ జీ, ఇంటిగ్రేటెడ్ ఫామ్ పాండ్స్ పాత్రపై ఈ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఎల్ నినో వల్ల ఏర్పడే ప్రతికూల పరిస్థితులను అధిగమించడం, వ్యవసాయ కుంటలు, పాండ్స్ ద్వారా నీటి సంరక్షణ, వ్యవసాయ అనుబంధ రంగాల సమన్వయంపై సమగ్రంగా చర్చించనున్నారు. ఈ వర్క్‌షాప్‌ను పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ సమన్వయం చేయనున్నారు.
ఈ సదస్సులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వ్యవసాయ సహకారశాఖ కార్యదర్శి, పశుసంవర్ధక మత్స్యశాఖ కార్యదర్శితో పాటు ఆయా విభాగాలకు చెందిన అధిపతులు తప్పనిసరిగా పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ వర్క్‌షాప్‌కు జిల్లాల నుంచి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్లు, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్లు పాల్గొనేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
