ఉద్యోగులారా.. మీరు చేసే యుద్ధంలో మేం ముందుంటాం.. కరీంనగర్ డెయిరీని విచ్ఛిన్నం చేసే కుట్ర

ఉద్యోగులారా.. మీరు చేసే యుద్ధంలో  మేం ముందుంటాం.. కరీంనగర్ డెయిరీని విచ్ఛిన్నం చేసే కుట్ర
  • పోలీసులు లాఠీఛార్జి చేస్తే... ఆ దెబ్బలు మేం భరిస్తం
  • అమ్ముడుపోయే నాయకులను జేఏసీలో కొనసాగించొద్దు  
  •  కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, వెలుగు : 'ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసే యుద్ధంలో ముందుండి పోరాడేందుకు బీజేపీ నాయకులు సిద్ధం, ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తే ఆ దెబ్బలు మేమే తింటాం, తూటాలు పేలిస్తే ఆ తూటాలకు బలయ్యేందుకు మేము సిద్ధం' అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఈ నెల 27 నుంచి ఉద్యోగ సంఘాల జేఏసీ చేపట్టిన పోరుబాటకు ఆయన మద్దతు ప్రకటించారు. 

వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా కరీంనగర్ లోని ఆర్అండ్​బీ గెస్ట్ హౌస్ లో ఆయన ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జేఏసీలో ఒకరిద్దరు నాయకులు ప్రభుత్వానికి అమ్ముడుపోయి ఉద్యమాన్ని వాయిదా వేయడం పరిపాటిగా మారిందని, అట్లాంటి వాళ్లను ఇకపై జేఏసీలో కొనసాగించొద్దని సూచించారు. 

రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు బీఆర్ఎస్  ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కళ్లు తెరిచి ఉద్యోగ, ఉపాధ్యాయులు పడుతున్న బాధలను గుర్తించి పోరుబాటకు సిద్ధమైనందుకు సంతోషంగా ఉందన్నారు. 

పీఆర్సీని అమలు చేయడం లేదని, హెల్త్ కార్డులు పని చేయడం లేదని, ఆరు డీఏలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఉద్యోగులకు రావాల్సిన సుమారు రూ.2 వేల కోట్ల బకాయిలు చెల్లించడం లేదన్నారు. కరీంనగర్ డెయిరీని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని, ఆ డెయిరీని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. 

లక్షలాది మంది రైతులకు మేలు చేసే సంస్థపై కక్ష సాధింపు చర్యలు సరికాదని, ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని వ్యవస్థను దెబ్బతీయడం దారుణం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కరీంనగర్ డెయిరీపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వం పక్షాన సాయం చేయకపోయినా.. అన్యాయం మాత్రం చేయొద్దని కోరారు.