- విజిలెన్స్తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమాలు
- రేఖా నాయక్ కొడుకుపైనా కేసు నమోదు
నిర్మల్/ఖానాపూర్, వెలుగు: సీఎంఆర్ ధ్యాన్నాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలతో నిర్మల్ జిల్లా ఖానా పూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై అధికారులు కేసు నమోదు చేశారు. ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో మాజీ ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్ పేరుపై ఉన్న ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో దాదాపు రూ. 40 కోట్ల విలువైన ధాన్యం పక్క దారి పట్టినట్టు పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రెండు రోజులుగా అధికారులు ఈ రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు.
2022–23, 2023–24,2024–25 సీజన్లకు సంబంధించిన 9 లక్షల 96 వేల టన్నుల ధాన్యం పక్కదారి పట్టిందని లెక్కతేల్చారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కూడా భారీగా బకాయి ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో రైస్ మిల్లు యజమాని అయిన రేఖా శ్యాం నాయక్ పై జిల్లా పౌర సరఫరాల అధికారి చుంచు సుధాకర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లతో ఖానాపూర్పోలీసులు కేసు నమోదు చేశారు.
జగిత్యాల జిల్లాలో ఆమె కుమారుడి మీద..
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మోగిలిపేటలో రేఖా నాయక్ కొడుకుకు చెందిన ఏఆర్ఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్‌లో కూడా సీఎంఆర్ పక్కదారి పట్టినట్టు అధికారుల విచారణలో తేలింది. ఇక్కడ రూ 46. 97 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. జగిత్యాల జిల్లా సివిల్ సప్లయ్స్ ఆధికారులు మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో రేఖా నాయక్ కొడుకు అజ్మీరా అక్షిత్‌పై ఫిర్యాదు చేయగా.. ఈ నెల 5న అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
