అమెరికా వీసా రూల్స్, మతపరమైన స్వేచ్ఛపై సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికాకు చెందిన మత స్వేచ్ఛ సలహా సంస్థ(USCIRF) సభ్యులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలు మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్నాయని.. కాబట్టి ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ త్వరలో అమెరికాలో పర్యడించనున్న తరుణంలో ఇది ప్రాధాన్యత సంతరించుకున్నాయి. న్యూయార్క్‌లో ‘అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్’ ఆధ్వర్యంలో జరగనున్న యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్స్ వేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ పర్యటనను పలు ప్రజా సంఘాలు, కమిషన్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ నాయకులకు అమెరికా ప్రభుత్వం ఎటువంటి డిప్లొమాటిక్ మర్యాదలు ఇవ్వకూడదని.. ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించకూడదని USCIRF చైర్ అసిఫ్ మహమూద్ అండ్ కమిషనర్ జీన్ మిల్స్ స్పష్టం చేశారు. మతపరమైన స్వేచ్ఛ ఉల్లంఘనలకు బాధ్యులైన ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులపై శాంక్షన్స్ విధించాలని వారు అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమెరికా సంస్థ చేసిన ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ నివేదికలు ఎప్పుడూ కక్ష్యపూరితంగా, పక్షపాత ధోరణితో ఉంటాయని భారత్ తేల్చిచెప్పింది. కేవలం వ్యూహాత్మక అజెండాలతో, అవాస్తవ ఆధారాలతో దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఈ సంస్థ ప్రవర్తిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అమెరికాలో హిందూ ఆలయాలపై దాడులు, అక్కడి భారతీయ ప్రవాసులపై పెరుగుతున్న బెదిరింపులను పట్టించుకోని ఈ సంస్థ.. భారత్‌పై మాత్రం నిరాధారమైన విమర్శలు చేస్తోందని భారత్ మండిపడింది. ఒకవైపు అంతర్జాతీయ వేదికలపై వాదనలు నడుస్తుండగానే, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అమెరికా పర్యటన.. దీనిపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
