ప్రేమకు భౌగోళిక హద్దులు లేవని.. పెళ్లికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు నిధిన్ చంద్, మార్టిన్ డే. చాలా కాలంగా కలిసి ఉంటున్న స్కాటిష్ రాజకీయ వేత్త, మంత్రి మార్టిన్ డే.. కేరళకు చెందిన నిధిన్ చాంద్ కేరళ గురువాయూర్ ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. తన 22 ఏళ్ల కొడుకు సమక్షంలో నిధిన్ చంద్ తన భాగస్వామితో మూడుముళ్లు వేసుకోవడం అందరినీ ఆకర్శించింది.
నిధిన్ చంద్, మార్టిన్ డేలకు తొమ్మిదేళ్ల క్రితమే పెళ్లి జరిగింది. అయితే తన మాతృదేశ సంస్కృతి సంప్రదాయాలతో పెళ్లి చేసుకోవాలనే కోరికతో.. 2026 ఆగస్టు 19న ఇండియాలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఖండాంతరాలు దాటిన ప్రేమ.. సంప్రదాయాలపై మక్కువతో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎలా కలిశారు..?
నిధిన్, డే 2008లో యూకేలో కలుసుకున్నారు. అప్పుడు ఆమె ఐటీ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి స్టూడెంట్ వీసాపై యూకే వెళ్లారు. పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో, యూకే ప్రభుత్వం వలస విధానాలలో పెద్ద మార్పులు ప్రవేశపెట్టింది. నిధిన్‌తో సహా వేలాది మంది విద్యార్థుల వీసాలను రద్దు చేసింది.
అయినప్పటికీ, ఆమె వెనక్కి తిరిగి వెళ్లకుండా, యూకే పార్లమెంటులో లాబీయింగ్ చేసి, ఇండియన్ స్టూడెంట్స్ సమస్యలను పార్లమెంటు ముందు ప్రస్తావించారు. ఆ సమయంలోనే ఆమె స్కాటిష్ మంత్రిని మార్టిన్ డే ను కలిశారు.
మొదట్లో వారి పరిచయం మామూలు సంభాషణలకే పరిమితం అయినప్పటికీ.. ఆ తర్వాత అది ప్రేమగా బలపడింది. ఆ తర్వాత బ్రిటన్ లో వివాహం చేసుకున్నారు. వాస్తవానికి కేరళలోని గురవాయూర్ లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ.. కేరళ వరదలు, కోవిడ్-19 మహమ్మారి వంటి వివిధ కారణాల వల్ల వాయిదా పడిందని తెలిపారు.
ఎవరీ మార్టిన్ డే ?
మార్టిన్ డే (55), స్కాటిష్ నేషనల్ పార్టీ (SNP) తరపున యూకే పార్లమెంట్ మాజీ సభ్యుడు. స్థానిక, జాతీయ స్థాయిలలో లిన్లిత్‌గో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన సుదీర్ఘ అనుభవం ఆయనకు ఉంది. ఆయన 1999లో వెస్ట్ లోథియన్ కౌన్సిల్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2015లో లిన్లిత్‌గో, ఈస్ట్ ఫాల్‌కిర్క్ ఎంపీగా యూకే హౌస్ ఆఫ్ కామన్స్‌లోకి ప్రవేశించారు.
తొమ్మిదేళ్లపాటు వెస్ట్‌మిన్‌స్టర్ ఎంపీగా మూడు పర్యాయాలు పనిచేయడానికి ముందు, ఆయన రిటైల్ బ్యాంకర్‌గా, స్థానిక కౌన్సిలర్‌గా పనిచేశారు. ప్రస్తుతం స్కాటిష్ పార్లమెంట్‌లో ఇండియా కోసం ఏర్పాటు చేసిన అఖిల పక్ష పార్లమెంటరీ బృందానికి అధ్యక్షత వహిస్తున్నారు.
ఇక పిరవం సమీపంలోని పంపాకుడకు చెందిన నిధిన్ చంద్ (49), ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత 2008లో యూకేకి వెళ్లి, ఐటీ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించారు. ఆమె తండ్రి పశువైద్య క్షేత్ర అధికారి కె.ఎన్. చంద్రన్, తల్లి పంపాకుడ గ్రామ పంచాయతీ మాజీ సభ్యురాలు రాజమ్మ.
మార్టిన్ డే ముందుగా ప్రపోజ్ చేసిన తర్వాత వాళ్ల ప్రేమ బలపడింది. 2016 మేలో వివాహం చేసుకున్నారు. అప్పటికే నిధిన్ కు పెళ్లయి.. 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. గతం గురించి చెప్పినప్పుడు, డే ఆమెను అంగీకరించడమే కాకుండా తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేశాడు. డే ఫ్యామిలీ కూడా వారి పెళ్లికి అంగీకరించడంతో వారి వివాహం చేసుకున్నారు.
