కెన్యాలో ఘోర ప్రమాదం.. 17 మంది దుర్మరణం

కెన్యాలో ఘోర ప్రమాదం.. 17 మంది దుర్మరణం
  • మరో ఏడుగురికి గాయాలు!

నైరోబి: కెన్యాలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున సలామా ఏరియాలోని నైరోబి–మొంబాసా హైవేపై ఓ లారీ మరో లారీని ఓవర్​టేక్ చేయడానికి ప్రయత్నించి ఎదురుగా వస్తున్న వ్యాన్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

పోలీసుల ప్రకారం.. డ్రైవర్ అజాగ్రత్త వల్లే లారీ అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న వ్యాన్​తో పాటు మరిన్ని వాహనాలను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి వ్యాన్ నజ్జునుజ్జయ్యింది. మృతులంతా నకురు కౌంటీలోని ప్రసిద్ధ సుబుకియా నేషనల్ ష్రైన్ (ప్రార్థనా స్థలం) వద్ద జరగనున్న ప్రార్థనల్లో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

వ్యాన్ డ్రైవర్​తో పాటు చనిపోయిన 17 మందిలో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. వీరంతా మొంబాసాలోని సెయింట్ మథియాస్ ములుంబా పారిష్​కు చెందిన క్యాథలిక్ క్రిస్టియన్లుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడినవారిని పోలీసులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రుటోతో పాటు మొంబాసా ఆర్చ్​ బిషప్​ మార్టిన్ కివువా సంతాపం వ్యక్తం చేశారు.