ఫ్లైదుబాయ్ కాక్‌పిట్ దాడి.. కెప్టెన్‌కు అండగా నిలిచిన ఆ ఇద్దరు పైలట్లు ఎవరు?

ఫ్లైదుబాయ్ కాక్‌పిట్ దాడి.. కెప్టెన్‌కు అండగా నిలిచిన ఆ ఇద్దరు పైలట్లు ఎవరు?

ఫ్లైదుబాయ్ విమానంలో కాక్‌పిట్ దాడి ఘటనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విమానాన్ని అదుపులోకి తీసుకురావడంలో సహాయపడిన ఇద్దరు అదనపు పైలట్ల గుర్తింపు ఇప్పటికీ వెల్లడికాలేదు. ఘటన జరిగి మూడు రోజులు గడిచినా, వారి పేర్లను ఫ్లైదుబాయ్ సంస్థ బహిరంగపరచలేదు. అయితే వారిద్దరూ సంస్థ సిబ్బందిలో భాగమేనని, అదే విమానంలో ప్రయాణికులుగా ప్రయాణిస్తున్నారని సంస్థ తెలిపింది.

టెల్ అవీవ్ నుంచి దుబాయ్‌కు తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఆ ఇద్దరు పైలట్లు ప్రయాణికులుగా విమానంలో ఉన్నట్లు ఓ ప్రయాణికుడు డేనియల్ ష్లిచ్టర్ వెల్లడించారు. సిబ్బంది విధుల్లో భాగంగా ప్రయాణికులుగా ప్రయాణించడాన్ని ‘డెడ్‌హెడింగ్’గా పిలుస్తారు.

కాక్‌పిట్‌లో కో-పైలట్ దాడితో కెప్టెన్ స్మిత్ మచ్చర్ తీవ్రంగా గాయపడిన సమయంలో పరిస్థితి అదుపు తప్పింది. కెప్టెన్ కాక్‌పిట్ తలుపు తెరవడంతో ఓ ప్రయాణికుడు కో-పైలట్‌ను బయటకు లాగేందుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో అదనపు పైలట్లలో ఒకరు వేగంగా కాక్‌పిట్‌లోకి చేరుకుని విమానం నియంత్రణను తన చేతుల్లోకి తీసుకున్నారు. అనంతరం రెండో పైలట్ కూడా కాక్‌పిట్‌లోకి వెళ్లడంతో ఇద్దరూ కలిసి తలుపులు మూసివేశారు.

విమానం వేగంగా కిందికి దిగుతున్న సమయంలో దాన్ని స్థిరీకరించేందుకు ఇద్దరు పైలట్లకు 10 నిమిషాలకు పైగా సమయం పట్టినట్లు సమాచారం. వారు మేడే అత్యవసర పిలుపు ఇచ్చి, విమానాన్ని సురక్షితంగా దించేందుకు అనువైన ప్రదేశం కోసం సహాయం కోరారు. చివరకు సౌదీ అరేబియాలోని తబూక్‌లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలకు ప్రశంసలు వెల్లువెత్తగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనతో మాట్లాడారు.