యాదగిరిగుట్టలో వైభవంగా ‘గిరిప్రదక్షిణ’..పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్టలో వైభవంగా ‘గిరిప్రదక్షిణ’..పాల్గొన్న  ప్రభుత్వ విప్  బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు:  యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా బుధవారం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక గిరిప్రదక్షిణ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. తెల్లవారుజామున ఉదయం 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద నరసింహస్వామి పాదాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అయిలయ్య అనంతరం భక్తులతో కలిసి కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు. గిరిప్రదక్షిణలో భాగంగా భక్తులు రెండున్నర కిలోమీటర్లు కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేశారు. కొండపైకి చేరుకుని గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు దేవస్థాన ఆఫీసర్లు ప్రత్యేక దర్శనం సదుపాయం కల్పించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. 

శాస్త్రోక్తంగా ‘అష్టోత్తర శతఘటాభిషేకం’

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు శతఘటాభిషేకాన్ని ఘనంగా చేపట్టారు. ఉత్సవంలో భాగంగా ప్రధానాలయ ముఖ మంటపంలో స్వర్ణ ధ్వజస్తంభానికి ఎదురుగా శుద్ధ జలంతో కూడిన 108 వెండి కలశాలను వరుసగా పేర్చి వేదపండితుల మంత్రోచ్ఛారణలు, పారాయణీకుల పారాయణాలు, యాజ్ఞీకులు, రుత్వికుల మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు, జపాల మధ్య, మంగళ వాయిద్యాల హోరు నడుమ కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 108 కలశాల్లో ఉన్న మంత్రజలంతో స్వామివారికి అర్చనాభిషేకాలు నిర్వహించారు.