మెదక్/చిన్నశంకరంపేట, వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఏటీఎం మెషీన్లు ధ్వంసం చేసి రూ. 29 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మెదక్ మండలం మంబోజిపల్లి చౌరస్తాలో బొడ్మట్‌పల్లి రూట్ లో రోడ్డు పక్కన షటర్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంకు మంగళవారం రాత్రి కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ముఖాలు మాస్క్ లు ధరించి, ఏటీఎం గదిలోకి వచ్చిన వారు మెషీన్ ను ధ్వంసం చేసి రూ.14 లక్షలకుపైగా ఎత్తుకెళ్లారు. అలాగే చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తాలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోనూ చోరీకి పాల్పడ్డారు. గవ్వలపల్లి చౌరస్తాలోని ఏటీఎంలో చోరీ జరిగినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై శివానంద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అర్ధరాత్రి రెండు గంటల తర్వాత చోరీ జరిగింది. ఏటీఎం సెంటర్లోకి వచ్చిన దుండగులు గ్యాస్ కట్టర్లతో మెషీన్ ను కట్ చేసి సుమారు రూ.15 లక్షలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు మెదక్ రూరల్, చిన్నశంకరంపేట పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
చోరీకి పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు
ఎస్పీ తెలిపారు.
