- పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు..రిమాండ్‌కు తరలించిన పోలీసులు
నిజాంపేట, వెలుగు: తాగుడుకు బానిసైన ఓ కొడుకు కన్నతల్లిని వేధించడంతోపాటు ఆమె నివసిస్తున్న ఇంటికి నిప్పు పెట్టిన ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గౌతమ్ రెడ్డి మద్యం తాగేందుకు, అలాగే కొత్త కారు కొనేందుకు డబ్బులు ఇవ్వాలని కొన్ని నెలలుగా తల్లి రజినిని వేధిస్తున్నాడు. డబ్బులు ఇవ్వలేదని తరచూ దూషిస్తూ, దాడి చేస్తూ చంపుతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 2న గౌతమ్ రెడ్డి మద్యం తాగి ఇంటికి వచ్చి తల్లితో మళ్లీ గొడవపడి దాడి చేశాడు.
రజిని రక్షణ కోసం రామాయంపేటలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తల్లి ఇంట్లో లేకపోవడంతో కోపోద్రిక్తుడైన గౌతమ్ రెడ్డి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. బాధితురాలు రజిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నిజాంపేట ఎస్సై రాజేశ్ తెలిపారు. గౌతమ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
