నీళ్లున్నా మోటార్లు ఆన్ చేయట్లే..రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్

నీళ్లున్నా మోటార్లు ఆన్ చేయట్లే..రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్
  •   మాజీ మంత్రి హరీశ్‌‌రావు

మెదక్, నర్సాపూర్, వెలుగు: కళ్లెదుట గోదావరి నీళ్లున్నా మోటార్లు ఆన్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటున్నదని మాజీ మంత్రి, బీఆర్‌‌ఎస్ ఫ్లోర్ లీడర్ హరీశ్‌‌రావు ధ్వజమెత్తారు. శనివారం మెదక్ జిల్లా కాగజ్ మద్దూర్ గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సమక్షంలో పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌‌ఎస్‌‌లో చేరారు.

 ఈ సందర్భంగా హరీశ్‌‌రావు మాట్లాడుతూ.. కన్నెపల్లిలో మోటార్లు ఆన్ చేస్తే నర్సాపూర్, మంజీరాకు పుష్కలంగా గోదావరి నీళ్లు వస్తాయన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సురక్షితంగా ఉన్నాయని నివేదికలు వచ్చాయని, నీళ్లు వాడుకోవచ్చని ఎన్‌‌డీఎస్‌‌ఏ హైకోర్టుకు స్పష్టం చేసిందన్నారు. అయితే నీళ్లు పారితే ప్రజలకు కేసీఆర్ గుర్తొస్తారనే భయంతోనే రేవంత్‌‌రెడ్డి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడం లేదని ఆరోపించారు.

 శ్రీశైలంలో, సమ్మక్క బ్యారేజీలో నిండుగా నీళ్లున్నా మోటార్లను 8 గంటలే నడుపుతున్నారని అన్నారు. కళ్లముందు నీళ్లున్నా ఎత్తకపోతే ఇది కాలం తెచ్చిన కరువు ఎలా అవుతుందని ప్రశ్నించారు. వ్యవసాయానికి ఏడు గంటల కరెంటు కూడా సక్రమంగా రావడం లేదన్నారు. 

సింగరేణి థర్మల్ ప్లాంట్ 800 మెగావాట్ల విద్యుత్‌‌ను రాజస్థాన్‌‌కు అమ్ముకునేందుకు జాయింట్ వెంచర్ చేసుకున్నారని, దీనిని వెంటనే రద్దు చేసి ఆ విద్యుత్‌‌ను రాష్ట్రానికే వినియోగించాలని తాను లేఖ రాసినట్లు తెలిపారు. రోడ్లకు గుంతలు పూడ్చేందుకు పైసలు లేవంటున్న ప్రభుత్వం.. మనుషులు, ఊరు, వాడ లేని ఫ్యూచర్ సిటీ వద్ద మాత్రం రూ.10 వేల కోట్లు పెట్టి ఆరు వరుసల రోడ్లు వేస్తోందని ఆరోపించారు. నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో హరీశ్‌‌రావు కాగజ్ మద్దూర్ గ్రామంలో మహిళా రైతు చిట్టోళ్ల నాగమణితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.