ఈ రోజుల్లో పెద్ద పెద్ద నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న.. చాలామంది యువత (జెన్-జెడ్ తరం) తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నారు. రోజూ ఆఫీస్ పనులు, రిమోట్ వర్క్‌ల వల్ల కొత్త పరిచయాలు పెంచుకోవడం, స్నేహితులను సంపాదించుకోవడం, వృత్తికి సంబంధించిన వారితో నెట్‌వర్క్ ఏర్పరచుకోవడం చాలా కష్టంగా మారింది.
సమస్యకు పరిష్కారంగా 'క్లాక్‌అవుట్'
యువత ఎదుర్కొంటున్న ఈ ఒంటరితనం సమస్యను పరిష్కరించేందుకు కృష్ణ దోసపాటి (32) అనే వ్యవస్థాపకురాలు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. డిజిటల్‌గా పరిచయమైన వారిని నిజ జీవితంలో కలుసుకునేలా చేయడానికి ఆమె 'క్లాక్‌అవుట్' అనే నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు.
ఏంటి ఈ యాప్?
ఈ యాప్ రఫ్‌గా లింక్డ్‌ఇన్, మీటప్ (Meetup)ల కలయికగా పనిచేస్తుంది.
ఎలా ఉపయోగపడుతుందంటే :
ఒకే రకమైన ఇంట్రెస్ట్, ఒకే రకమైన ఉద్యోగాలు లేదా వృత్తులు చేసే యంగ్ ప్రొఫెషనల్స్ ని ఒకచోటకు చేర్చుతుంది. వారికి దగ్గర్లో ఉన్న క్లబ్‌లు, ఈవెంట్‌లతో కనెక్ట్ చేస్తూ నిజ జీవితంలో కలవడానికి సహాయపడుతుంది.
రూ. 33.5 కోట్ల నిధులు
ఈ యాప్ కి ఉన్న ఆదరణను చూసి 114 వెంచర్స్ నాయకత్వంలో చాల ప్రముఖ పెట్టుబడి సంస్థలు క్లాక్‌అవుట్‌లో ఏకంగా $3.5 మిలియన్లు అంటే సుమారు రూ. 33.5 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి. అక్టోబర్ 2024లో ప్రారంభమైన ఈ యాప్, పేయిడ్ ఫీచర్లు తెచ్చిన 10 నెలల్లోనే 6 లక్షల కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లను సాధించింది. ఇంకా ఏడాదికి 11 లక్షల ఆదాయాన్ని ఇస్తుంది. 2025లోనే యూజర్లు ఒకరికొకరు దాదాపు 4 లక్షల ఇన్విటేషన్లు పంపుకున్నారు.
గాలప్ నివేదిక ఏం చెప్తోంది?
గాలప్ డేటా ప్రకారం... 35 ఏళ్లలోపు ఉద్యోగులలో 22 శాతం మంది తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచే పనిచేసే అంటే రిమోట్ వర్కర్లు వారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంది.
ధరలు & సర్వీస్:
'క్లాక్‌అవుట్' ఉచిత సేవలతో పాటు ఫ్రీమియం మోడల్‌లో పనిచేస్తుంది. అదనపు ఫీచర్లు, ఆన్ లిమిటెడ్ ఈవెంట్‌లు, క్లబ్‌ల యాక్సెస్ కోసం సంవత్సరానికి $99 చందా (Subscription) అంటే రూ. 9,530 ఫీజుగా వసూలు చేస్తోంది.
