దశాబ్దాలుగా లక్షలాది మంది ఇంజనీర్లను అందించిన మద్రాస్ ఐఐటీ ..ఇప్పుడు డాక్టర్లను కూడా తయారుచేసేందుకు రెడీ అవుతోంది. త్వరలో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ లో వైద్య విద్య విభాగాన్ని ఏర్పాటు చేసి ఎంబీబీఎస్, ఎండీ, పీహెచ్ డీ కోర్సులు అందిస్తామని ఐఐటీ మద్రాస్ కీలక ప్రకటన చేశారు.
దాదాపు 70 ఏళ్లుగా ఇంజినీరింగ్ విద్యకు పేరుగాంచిన ఐఐటీ మద్రాస్ ఇప్పుడు వైద్య విద్య వైపు అడుగులు వేస్తోంది. త్వరలోనే మద్రాస్ ఐఐటీలో వైద్య శాస్త్ర విభాగాన్ని ప్రారంభించి MBBS, MD, PhD కోర్సులు అందించాలని భావిస్తున్నట్లు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి తెలిపారు.
ఐఐటీ మద్రాస్ ఈ నిర్ణయం కొత్తదేమీ కాదు. 2023లోనే ఐఐటీ మద్రాస్ Medical Science and Technology విభాగాన్ని ప్రారంభించింది. ఇందులో ఇంజినీరింగ్, జీవశాస్త్రానికి సంబంధించిన విద్యను కలిపి బోధిస్తున్నారు. విద్యార్థులు స్కానర్లు, ఇంప్లాంట్లు, మెడికల్ సాఫ్ట్‌వేర్ వంటి సాంకేతిక పరికరాల రూపకల్పనపై పనిచేస్తున్నారు.
ఇప్పుడు దీనిని మరింత విస్తరించి నేరుగా డాక్టర్లను తయారు చేయాలని ఐఐటీ మద్రాస్ భావిస్తోంది. మోడర్న్ ట్రీట్ మెంట్ లో టెక్నాలజీ కీ రోల్ పోషిస్తున్న కమ్రంలో ఇంజినీర్లు, వైద్యులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ కామకోటి అన్నారు.
అయితే ఐఐటీ మద్రాస్‌లో MBBS ప్రారంభించాలంటే జాతీయ వైద్య కమిషన్ (NMC) అనుమతి తప్పనిసరి. అలాగే విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు బోధనా ఆసుపత్రి వంటి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వైద్య విద్యలో ఐఐటీ ఖరగ్‌పూర్ ముందుకు వెళ్తున్న క్రమంలో ఐఐటీ మద్రాస్ కూడా అదే దిశగా ముందుకు సాగుతోంది.
