- లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం!
- వరంగల్ ఎంజీఎంలో చికిత్స.. పరిస్థితి విషమం
నర్సంపేట (వరంగల్), వెలుగు: వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు గిరిజన బాలికలు మిస్సింగ్ అయ్యారు. అయితే వీరిద్దరు లైంగిక వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సోమవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఖానాపురం మండలం కోమటిపల్లి తండాకు చెందిన ఇద్దరు బాలికలు మంగళవారిపేట హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నారు. ఇద్దరూ నిత్యం ఆర్టీసీ బస్సులో స్కూల్కు వెళ్లి వస్తుండేవారు. సెప్టెంబర్ 29న ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన వారు సాయంత్రం తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఖానాపురం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలికల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బాలికలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
ట్రాప్ చేసి వేధింపులు..
దర్యాప్తులో భాగంగా బాలికలను ఇద్దరు యువకులు ట్రాప్ చేసి లైంగిక వేధింపులకు దిగినట్లు తెలిసింది. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలానికి చెందిన యువకుడితో పాటు సూర్యాపేట జిల్లాకు చెందిన మరో యువకుడు ఉన్నట్లు తెలిసింది. చికిత్స పొందుతున్న ఇద్దరు బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
