ఫ్యూచర్ సిటీలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్ లు .. ఏర్పాటుకు ప్రత్యేక విధానం రూపొందించాలి : సంజయ్ జాజు

ఫ్యూచర్ సిటీలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్ లు .. ఏర్పాటుకు ప్రత్యేక విధానం రూపొందించాలి : సంజయ్ జాజు
  • యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు వేగవంతం చేయాలి: సీఎస్​ 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో విద్యా మౌలిక వసతుల కల్పనతో పాటు తెలంగాణను అంతర్జాతీయ విద్యా హబ్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌‌‌‌ల ఏర్పాటుకు ప్రత్యేక విధానాన్ని (పాలసీ) రూపొందించాలని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాన్ని  గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. లండన్, బర్మింగ్‌‌‌‌హామ్ విశ్వవిద్యాలయాలతో పాటు మరో నాలుగు అంతర్జాతీయ వర్సిటీలు ఫ్యూచర్ సిటీలో బ్రాంచీలు పెట్టేందుకు ఆసక్తి చూపాయని, రాబోయే ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ గ్లోబల్ సమ్మిట్ నాటికి వీటిపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

అలాగే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దశలవారీగా చేపట్టే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో భాగంగా డిసెంబర్ 2027 నాటికి 67, జూన్ 2028 నాటికి 87 పాఠశాలల నిర్మాణాలను 26 ఎకరాల చొప్పున ఆధునిక సదుపాయాలు, డిజిటల్ క్లాస్‌‌‌‌రూమ్‌‌‌‌లతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులంతా ఒకే క్యాంపస్‌‌‌‌లో చదువుకునేలా దేశానికే ఆదర్శంగా ఈ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలపగా, ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్ రంజన్, సబ్యసాచి ఘోష్, ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.