ఆస్తుల జప్తు ఆదేశాలు.. మిల్లర్లలో వణుకు..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 120 మందికి పైగా మిల్లర్లు డీఫాల్ట్

ఆస్తుల జప్తు ఆదేశాలు.. మిల్లర్లలో వణుకు..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 120 మందికి పైగా మిల్లర్లు డీఫాల్ట్
  • సీఎంఆర్ పెండింగ్ బకాయిలు రూ. 638 కోట్లు
  • టెండర్ ధాన్యం బకాయిల వసూళ్లలో పురోగతి 

కరీంనగర్, వెలుగు : సీఎంఆర్ బకాయిలతో పాటు టెండర్ వడ్ల డబ్బులు చెల్లించని మిల్లర్ల ఆస్తులను జప్తు చేసేందుకు సర్కార్ రంగం సిద్ధం చేస్తుండడంతో ఎగవేతదారుల్లో వణుకు మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2022 నుంచి 2024 వరకు అన్ని సీజన్లకు సంబంధించి 120 మంది మిల్లర్లు డిఫాల్టర్లుగా తేలగా వీరి నుంచి రూ. 638 కోట్లు వసూలు కావాల్సి ఉంది. 

ఇందులో కరీంనగర్ జిల్లాలో 40 మిల్లుల నుంచి రూ.180 కోట్లు వసూలు కావాల్సి ఉండగా.. జగిత్యాల జిల్లాలో 30 మిల్లుల నుంచి రూ.220 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో 38 మిల్లుల నుంచి రూ.238 కోట్లు రావాల్సి ఉంది. ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా, గడువు పెంచినా వీరు స్పందించకపోవడంతో ఆస్తుల జప్తునకు ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు.

ఐదు నుంచి 10 శాతం ఎగవేతదారులు...

కరీంనగర్ జిల్లాలో 2022 నుంచి 2024 వరకు ప్రతి సీజన్ లో 5 నుంచి 10 శాతం మంది మిల్లర్లు ఎగవేతదారులుగా  మిగిలిపోయారు. ఇలా 40 మిల్లుల నుంచి సుమారు.180 కోట్ల విలువైన సీఎంఆర్ పెండింగ్ లో ఉంది. 

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లికి చెందిన శ్రీసీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి 22,122 టన్నులకు సంబంధించి రూ.54.18 కోట్లు, జమ్మి కుంట మండలం కోరపల్లి మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి 19.860 టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.49.83 కోట్లు వసూలు కావాల్సి ఉంది. బండారు మారుతి, ఆయన భార్య పేరిట ఉన్న ఈ రెండు మిల్లుల నుంచి పెనాల్టీ, వడ్డీ కలిపితే రూ.130 కోట్ల మేర బకాయి ఉంది. 

అలాగే జగిత్యాల జిల్లాలో శ్రీ అభయాంజనేయస్వామి ఇండస్ట్రీస్, శ్రీలక్ష్మి గణపతి ఇండస్ట్రీస్, శ్రీలక్ష్మీ బాలాజీ ఇండస్ట్రీస్ లో తనిఖీలు నిర్వహించి సుమారు రూ.132 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు విజిలెన్స్ ఆఫీసర్లు గుర్తించారు. మిల్లుల నిర్వాహకులపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

టెండర్ ధాన్యం బకాయిలు రూ. 35 కోట్లు

టెండర్ ధాన్యానికి సంబంధించి కరీంనగర్ జిల్లాలో రూ.125 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ నెల 3 వరకు రూ.89.54 కోట్లను చెల్లించగా.. ఇంకా రూ.35 కోట్లు వసూలు కావాల్సి ఉంది. అత్యధికంగా శ్రీనిధి ట్రేడర్స్ (మానకొండూరు) రూ. 5.74 కోట్లు పెండింగ్ లో ఉండగా... వరుణ్ ఇండస్ట్రీస్ (హుజూరాబాద్) రూ. 5.58 కోట్లు, శ్రీ శ్వేత ఆగ్రో ఇండస్ట్రీస్ (చొప్పదండి) రూ. 5.46 కోట్లు బకాయి ఉన్నాయి. 

వీటితో పాటు శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ట్రేడర్స్(గోపాల్‌‌‌‌‌‌‌‌పూర్), సౌజన్య ఆగ్రో ఇండస్ట్రీస్ (ఆర్నకొండ), శ్రీ లక్ష్మివెంకటరమణ ఇండస్ట్రీస్ (బోర్నపల్లి), సప్తగిరి ఇండస్ట్రీస్ (జమ్మికుంట), శ్రీ రాజరాజేశ్వర పీబీఆర్ఎం (తాడికల్), శ్రీ శ్రీదేవి ఇండస్ట్రీస్ (జమ్మికుంట), లక్ష్మీ ఎంఆర్ఎం- (మొలంగూర్), ఎస్.ఆర్ ట్రేడర్స్(రంగాపూర్), అరుణోదయ ఆగ్రో ఇండస్ట్రీస్(శాయంపేట), ధనలక్ష్మి ఇండస్ట్రీస్ ( బొమ్మకల్), విజయలక్ష్మి ఇండస్ట్రీస్ (అలుగునూర్) ఉన్నాయి. వీటి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు రావాల్సి ఉంది. 

 ఒకే యాజమాన్యానికి చెందిన మానకొండూరులోని వీరభద్ర ఇండస్ట్రీస్, సిద్ది వినాయక ఇండస్ట్రీస్, తిమ్మాపూర్ మండలం రేణికుంటలోని ఆర్కే ఇండస్ట్రీస్, సాయిశ్రీనివాస ఇండస్ట్రీస్ ఓనర్లు రెండు నెలల కిందే రూ.35 కోట్లు చెల్లించారు. అలాగే తిమ్మాపూర్ లోని వేంకటేశ్వర ఇండస్ట్రీస్, మానకొండూరులోని మానస, తిరుమల, హనుమాన్ ఇండస్ట్రీస్ తదితర 35 మిల్లుల నుంచి బకాయిలు పూర్తిగా వసూలయ్యాయి.