సింగరేణి లాభాల్లో 40 శాతం వాటా చెల్లించాలి : ఏఐటీయూసీ, టీబీజీకేఎస్, సీఐటీయూ సంఘాల లీడర్లు

సింగరేణి లాభాల్లో 40 శాతం వాటా చెల్లించాలి : ఏఐటీయూసీ, టీబీజీకేఎస్, సీఐటీయూ సంఘాల లీడర్లు

కోల్​బెల్ట్, వెలుగు: 2025–-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను ప్రకటించి, కార్మికులు 40 శాతం వాటా చెల్లించాలని కార్మిక సంఘాల లీడర్లు డిమాండ్​ చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లపై  సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, టీబీజీకేఎస్, సీఐటీయూ యూనియన్లు వేర్వేరుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. 

ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు దాటినా లాభాలను సింగరేణి యాజమాన్యం ప్రకటించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలు వెంటనే ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్మిక సంఘాల లీడర్లు వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, కొట్టె కిషన్​రావు, కొమురయ్య, భీమనాధుని సుదర్శనం, కంది శ్రీనివాస్, కె. సురేందర్​రెడ్డి, ఎండీ లాల్, అల్లి రాజేందర్​ పాల్గొన్నారు.