- సిరిసిల్ల కలెక్టరేట్ లో ఆఫీసర్లతో సమీక్ష
సిరిసిల్ల టౌన్, వెలుగు : వేములవాడ ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయేలా రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.
భవిష్యత్ లో పెరగబోయే రద్దీకి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని, ఆ మేరకు అన్ని వసతులు కల్పించాలని చెప్పారు. ప్రతి పనికి గడువు నిర్ణయించాలని, అఫీసర్లు ప్రత్యేక శ్రద్ధతో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తూ... పురోగతిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారన్నారు.
సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఆఫీసర్లు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయన్నారు. సమ్మక్క-సారలమ్మ ఆలయానికి భక్తులు నిరంతరం వెళ్లేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. 80 ఫీట్ల రోడ్డు పనులను సైతం త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వేములవాడ ఆర్డీఓ కేఎస్ బీ. కుమారి, ఈఈ భీమ్లానాయక్, రాజరాజేశ్వరస్వామి ఆలయ ఈఓ రమాదేవి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఎం. శ్రీనివాస్, ఆలయ ఈఈ రాజేశ్, మున్సిపల్ కమిషనర్ లోకేశ్, తహసీల్దార్ జయంత్ పాల్గొన్నారు.
