- హుస్నాబాద్‌లో ట్రాక్టర్ ను బైక్ ఢీకొని ఇద్దరు
- మెదక్ జిల్లాలో స్కూటీని ఢీకొట్టిన బస్సు, ఇద్దరు మృతి
హుస్నాబాద్/రామాయంపేట, వెలుగు : సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో సోమవారం జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే... సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన బైరి నర్సింహ(35), నద్దునూరి శ్రీకాంత్ (32), నద్దునూరి శ్రీనివాస్ బైక్ పై హనుమకొండ, సిద్దిపేట ప్రధాన రహదారిపై వెళ్తున్నారు.
ఇదే సమయంలో మున్సిపల్ సిబ్బంది ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండానే చెత్త ట్రాక్టర్ ను రోడ్డుపై నిలిపారు. దీంతో బైక్ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైరి నర్సింహ, నద్దునూరి శ్రీకాంత్ అక్కడికక్కడే చనిపోయారు. శ్రీనివాస్ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ కు చెందిన మామిండ్ల చంద్రయ్య (55), మామిండ్ల పోచవ్వ (50) స్కూటీపై చేగుంట వైపు నుంచి రామాయంపేట వైపు వెళ్తున్నారు. కాస్లాపూర్ యూటర్న్ వద్దకు రాగానే నిజామాబాద్ కు చెందిన ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.
