గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ..సర్వేతో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ..సర్వేతో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

నిర్మల్, వెలుగు : రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించి, గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన భూ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆఫీసర్లను ఆదేశించారు. 

మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్మల్‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెల్లో ఉంటున్న 72 వేల నుంచి 73 వేల మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు.

 
మొదటి దశలో 4.50 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టగా, రెండో దశలో మరో రెండు లక్షలకు పైగా ఇండ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇండ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. 

అటవీ సంబంధిత సమస్యల కారణంగా ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోకుండా ఆఫీసర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. భూసమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భూముల సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. వచ్చే ఏడాదిన్నరలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో భూ సర్వే పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

 సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో రెవెన్యూ, అటవీ శాఖకు సంబంధించిన సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలన్నారు. సమావేశంలో చీఫ్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ లోకేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ శాఖ (రిజిస్ట్రేషన్లు, స్టాంపులు) ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌‌‌‌‌‌‌‌గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ. గౌతమ్‌‌‌‌‌‌‌‌, నిర్మల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భవేశ్‌‌‌‌‌‌‌‌ మిశ్రా, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ రాజర్షి షా, కుమ్రం భీం ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్‌‌‌‌‌‌‌‌, పవార్‌‌‌‌‌‌‌‌ రామారావు పటేల్‌‌‌‌‌‌‌‌, అనిల్‌‌‌‌‌‌‌‌ జాదవ్‌‌‌‌‌‌‌‌, కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్ బాబు, ఐటీడీఏ పీవో మంద మకరందు 
పాల్గొన్నారు.
 
ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో ఉండాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆఫీసర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. 

ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామీణ ప్రాంతాల్లో బలమైన సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి భూ సర్వే గొప్ప అవకాశమని, గ్రామ సభలు నిర్వహించి సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.