- ఫారం-6 రూల్స్ అక్రమంగా మార్చారని ఆరోపణ
న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఫారం-6లో అక్రమంగా, ఏకపక్షంగా మార్పులు చేశారనడానికి తిరుగులేని ఆధారాలున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం వెల్లడించారు. మన ప్రజాస్వామ్యంపై జరిగిన ఈ నేరపూరిత దాడిలో సీఈసీతో పాటు భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ బాధ్యులను చేస్తామని ఆయన హెచ్చరించారు.
వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సమయంలో ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న ఫారం-6లో ఎలాంటి మార్పులకూ తాము ఆమోదం తెలపలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకోవడానికి ఫారం-6 దరఖాస్తును ఉపయోగిస్తారని, ఇందులో మార్పులు చేస్తూ బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే సీఈసీ తన పదవిని దుర్వినియోగం చేశారని రాహుల్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడ్డారు.
పచ్చి అబద్ధాలు చెప్పారు: జైరామ్ రమేశ్, ఖేరా
ఈ వివాదంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ స్పందిస్తూ.. సీఈసీ పచ్చి అబద్ధం చెప్పారని మండిపడ్డారు. ప్రధాని మోదీ భయపడుతున్న 'జెన్-జీ' ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకే సీఈసీ ఫారం-6ను వక్రీకరించారని, ఈ చర్యలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేరా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందంటూ ఈసీ ఇంతకాలం చెప్పిన అబద్ధాలు బట్టబయలయ్యాయని, త్వరలోనే జ్ఞానేశ్ కుమార్ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
