- ప్రియాంక గాంధీ ఆగ్రహం
- ప్రతిపక్షాల నిరసనలపై బీజేపీ, శివసేన నేతల విమర్శలు
న్యూఢిల్లీ: ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియలో భాగంగా ఓట్ల తొలగింపులు రాజ్యాంగానికి, ఎన్నికల వ్యవస్థకు పూర్తిగా విరుద్ధమని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. ఎన్నికలు ఏ విధంగా తారుమారు చేయబడ్డాయో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైందని ఆమె పేర్కొన్నారు. సోమవారం విలేకరులతో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఈ ఓట్ల తొలగింపులు మన రాజ్యాంగానికి, ఎన్నికల ప్రక్రియకు విరుద్ధంగా ఉన్నాయని, దీనిపైనే తాము నిరసన తెలుపుతున్నామని, తమ ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈవీఎంలు, ఈసీని తప్పుబట్టడం అలవాటే
ప్రతిపక్షాల నిరసనలపై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ స్పందిస్తూ ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగి ఉంటే మీ పార్టీ ఏజెంట్ల ద్వారా ఎన్ని ఫిర్యాదులు చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలను, ఎన్నికల కమిషన్‌ను తప్పుబట్టడం అలవాటుగా మార్చుకుందని విమర్శించారు. రిగ్గింగ్‌లు తగ్గి ఎన్నికలు సజావుగా జరుగుతుంటే ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. శివసేన (యూబీటీ) ఎంపీ అనిల్ దేశాయ్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌కు సంబంధించి వెలుగులోకి వచ్చిన అంశాలకు సరైన వివరణ గానీ, సమాధానం గానీ రాలేదన్నారు. మరోవైపు ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ప్రచురించిన కథనం రాజకీయంగా దుమారం రేపింది. ఈ విమర్శలపై ఈసీ స్పందిస్తూ.. సంస్థలో భిన్నాభిప్రాయాలు సహజమని, తమ ఆదేశాలన్నీ చట్టబద్ధమైనవేనని స్పష్టం చేసింది.
