చేప పిల్లల బిల్లుల చెల్లింపుపై  ఐఏఎస్‌‌‌‌లకు నోటీసులు 

చేప పిల్లల బిల్లుల చెల్లింపుపై  ఐఏఎస్‌‌‌‌లకు నోటీసులు 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రభుత్వానికి సరఫరా చేసిన చేప పిల్లలకు సంబంధించిన రూ.37.18 లక్షల బిల్లుల చెల్లింపులో కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదన్న ఆరోపణలపై పలువురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌‌‌‌కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి కె. ఇలంబర్తి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, మత్స్యశాఖ డైరెక్టర్‌‌‌‌ తదితరులకు ఈ నోటీసులు అందాయి.

బిల్లుల చెల్లింపు కోసం నాగేంద్రకుమార్ దత్త దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌పై గతంలో విచారణ జరిపిన జస్టిస్ మాధవీదేవి.. విజిలెన్స్ నివేదికలో పిటిషనర్ పేరు లేనిపక్షంలో వెంటనే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. ఆ ఉత్తర్వులు అమలు కాలేదని పేర్కొంటూ నాగేంద్రకుమార్ దత్త కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను వాయిదా వేశారు.