రూ. 500 కోసం తండ్రిని చంపిన కొడుకు..జహీరాబాద్ లో ఘటన

రూ. 500 కోసం తండ్రిని చంపిన కొడుకు..జహీరాబాద్ లో ఘటన

జహీరాబాద్, వెలుగు : రూ. 500 తీసుకున్నాడన్న కోపంతో ఓ యువకుడు తన తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన జహీరాబాద్ పట్టణ పరిధిలోని అల్లీపూర్ లో బుధవారం రాత్రి జరిగింది. టౌన్ ఎస్సై లవకుమార్ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బీదర్ జిల్లా బరూర్ గ్రామానికి చెందిన శంకర్ (72) కుటుంబ సభ్యులతో కలిసి అల్లీపూర్ లో ఉంటూ కూలీ పనులు చేస్తున్నాడు. 

శంకర్ కుమారుడు తుకారాం వద్ద రూ. 500 కనిపించకుండా పోయాయి. ఆ డబ్బులను తండ్రే తీసుకున్నాడని అనుమానించిన తుకారాం డబ్బులు ఇవ్వాలని తండ్రిని వేధించాడు. తాను డబ్బులు తీసుకోలేదని శంకర్ ఎంత చెప్పినా వినని తుకారాం.. మద్యం మత్తులో కత్తితో తండ్రిపై దాడి చేసి చంపేశాడు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

మహబూబాబాద్ జిల్లా మడిపల్లిలో వ్యక్తి

తొర్రూరు, వెలుగు : మహబూబాబాద్​జిల్లా తొర్రూరు మండలంలోని మడిపెల్లి గ్రామంలో ముదిరాజ్ కులస్తుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. గ్రామంలోని ముదిరాజ్ కులానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల చనిపోవడంతో బుధవారం ఐదో రోజు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటుక రమేశ్ (43)తో పాటు మరికొందరు హాజరయ్యారు. 

అక్కడ చిన్నపాటి గొడవ జరగడంతో యాకన్న, వెంకన్న, జంపయ్య, మహేశ్ తో పాటు మరో పది మంది కలిసి కర్రలు, రాళ్లతో రమేశ్ పై దాడి చేశారు. అనంతరం స్థానిక చెరువు సమీపంలోకి తీసుకెళ్లి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.